ఉత్తర భారతీయ వంటకాలలో మరియు రెస్టారెంట్లలో పనీర్ కర్రీస్, నాన్-వెజ్ గ్రేవీలతో నంజుకుని తినే ప్రసిద్ధ రొట్టె 'బటర్ నాన్'. సాధారణంగా బటర్ నాన్ అనగానే రెస్టారెంట్లలో పెద్ద పెద్ద తందూర్‌లలో కాలుస్తుంటారు. అయితే ఇంట్లో తందూర్ లేకపోయినా మన ఇంట్లోని మామూలు పెనం పైనే అచ్చం రెస్టారెంట్ స్టైల్ దూదిలాంటి మెత్తటి బటర్ నాన్లను ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.
పనీర్ బటర్ మసాలా లేదా చికెన్ గ్రేవీలతో ఈ వేడి వేడి బటర్ నాన్ కలుపుకుని తింటే అమృతతుల్యంగా ఉంటుంది. ఈ బటర్ నాన్ తయారీకి ముందుగా ఒక పాత్రలో ఒకటిన్నర కప్పుల మైదా పిండి తీసుకోవాలి. అందులో పావు కప్పు కమ్మటి పెరుగు, అర టీస్పూన్ బేకింగ్ సోడా, అర టీస్పూన్ పంచదార, అర టీస్పూన్ ఉప్పు వేసి కలపాలి.
ముందుగా పిండిని పెరుగులోనే బాగా కలిపి, ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతి పిండి కంటే కాస్త జిగురుగా ఉండేలా తడుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నూనె వేసి పిండిని కనీసం 5 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి. పిండిని ఎంత బాగా ఒత్తితే నాన్ అంత మెత్తగా వస్తుంది.
తర్వాత పిండిని సమాన భాగాలుగా బాల్స్‌లా చేసి, పైన ఆయిల్ రాసి తడి గుడ్డ కప్పి 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలి . నానిన పిండి ముద్దను తీసుకుని చేత్తో ఒత్తుకుంటూ లేదా చేతులతో సాగదీస్తూ పర్ఫెక్ట్ నాన్ షేప్‌లో ఒత్తుకోవాలి. ఇప్పుడు నాన్ కి ఒకవైపు భాగాన నీటితో బాగా తడి చేయాలి.
నీళ్లు తడిపిన వైపు భాగాన్ని బాగా కాలిన పెనం మీద వేయాలి. సన్నటి మంటపై ఒక నిమిషం కాాలాక, పెనాన్ని తిరగేసి గ్యాస్ ఫ్లేమ్‌పై నాన్ను అన్ని వైపులా కాల్చుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ స్పాట్స్ వచ్చాక బయటకు తీసి, వేడి మీద ఉన్నప్పుడే వెన్న (మెల్టెడ్ బటర్) అప్లై చేస్తే కమ్మటి బటర్ నాన్ సిద్ధమవుతుంది.




