Headlines

CWG 2026 : పంచ్‌లు పడుతుంటే డిఫెన్స్ కూడా మర్చిపోయాడు.. భారత బాక్సర్ ధాటికి పాక్ ప్లేయర్ మైండ్ బ్లాక్ | CWG 2026 Boxing Jadumani Singh Defeats Pakistans Sumama Rehman to Reach Quarter Finals

CWG 2026 : పంచ్‌లు పడుతుంటే డిఫెన్స్ కూడా మర్చిపోయాడు.. భారత బాక్సర్ ధాటికి పాక్ ప్లేయర్ మైండ్ బ్లాక్ | CWG 2026 Boxing Jadumani Singh Defeats Pakistans Sumama Rehman to Reach Quarter Finals


CWG 2026 : స్కాల్టాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. క్రికెట్, హాకీ వంటి ఆటల్లో భారత్-పాకిస్థాన్ పోరు ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుందో, బాక్సింగ్ రింగ్‌లోనూ అదే స్థాయిలో మ్యాచ్ జరిగింది. ఆదివారం రాత్రి పురుషుల 55 కేజీల విభాగంలో జరిగిన రౌండ్-16 బావుట్‌లో మణిపూర్‌కు చెందిన 22 ఏళ్ల భారత బాక్సర్ జాదుమణి సింగ్ మందెంగ్‌బామ్, పాకిస్థాన్‌కు చెందిన సుమామ రెహమాన్‌ను ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన జాదుమణి 5-0 తేడాతో ప్రత్యర్థిని క్లీన్ స్వీప్ చేస్తూ క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.

కార్గిల్ విజయ్ దివస్ నాడే విజయ భేరి.. హీరోలకు అంకితం

భారతదేశం అంతటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని వీర సైనికులకు నివాళులర్పిస్తున్న రోజే, గ్లాస్గో రింగ్‌లో పాకిస్థాన్ బాక్సర్‌పై జాదుమణి విజయం సాధించడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. విజయానంతరం అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన జాదుమణి.. ఈ ఘనవిజయాన్ని 1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడిన భారత సైనిక వీరులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. పాకిస్థాన్ బాక్సర్‌పై గెలవడం ఎంతో గర్వంగా ఉందని, క్వార్టర్ ఫైనల్‌లోనూ ఇదే తరహా ప్రదర్శన ఇచ్చి దేశానికి స్వర్ణ పతకం తీసుకురావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని అతను తెలిపాడు.

రింగ్‌లో తిరుగులేని ఆధిపత్యం

తొలి రౌండ్‌లో బై దక్కడంతో పాక్ బాక్సర్ సుమామ రెహమాన్ నేరుగా ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. అయితే రింగ్‌లోకి దిగిన జాదుమణి తన కంటే కాస్త పొడవుగా ఉన్న పాకిస్థాన్ బాక్సర్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మూడు రౌండ్ల పాటు సాగిన ఈ పోరులో తొలి రెండు రౌండ్లను జాదుమణి 5-0తో కైవసం చేసుకున్నాడు. మూడో రౌండ్‌లో పాక్ బాక్సర్ పుంజుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, భారత బాక్సర్ తన పంచ్‌లతో ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాడు. ఐదుగురు జడ్జిలు జాదుమణికి అనుకూలంగా 30-27, 29-28, 30-27, 29-28, 30-27 పాయింట్లు ఇవ్వడంతో జాదుమణి ఏకపక్షంగా విజయం సాధించాడు.

పతకానికి చేరువలో భారత బాక్సర్లు

ఈ విజయంతో జాదుమణి సింగ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాన్ని ఖాయం చేయడానికి మరో అడుగు దూరంలో నిలిచాడు. క్వార్టర్ ఫైనల్‌లో విజయం సాధిస్తే అతను సెమీఫైనల్ చేరుకుంటాడు, దాంతో కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. బాక్సింగ్‌లో భారత్‌కు ఇప్పటికే ఒక పతకం ఖాయమైంది. ఒలింపిక్ మెడలిస్ట్ లోవ్లినా బోర్గోహెయిన్‌కు నేరుగా సెమీఫైనల్ బై దక్కడంతో ఆమె పతకాన్ని ఖరారు చేసుకుంది. మరోవైపు మహిళల 54 కేజీల కేటగిరీలో భారత బాక్సర్ ప్రీతి పవార్ కూడా రౌండ్-16 లోకి అడుగుపెట్టి పతకం దిశగా ముందంజ వేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *