IND vs SL : భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఆగస్టు 04న ముంబై ఎయిర్ పోర్టు నుంచి శ్రీలంకకు పయనమైంది. అయితే లంకకు బయల్దేరిన 15 మంది సభ్యుల భారత జట్టులో కేవలం 14 మంది ఆటగాళ్లు మాత్రమే కనిపించారు. యంగ్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ జట్టుతో పాటు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించకపోవడం, ఆయన విమానం ఎక్కకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాయి సుదర్శన్ జట్టుతో పాటు ఎందుకు వెళ్లలేదనే దానిపై అభిమానుల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫిట్నెస్ సస్పెన్స్.. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఏంటి?
ఈ పర్యటనకు జట్టును ప్రకటించే సమయంలోనే బీసీసీఐ కీలక విషయాన్ని వెల్లడించింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాటర్ సాయి సుదర్శన్ లంక సిరీస్‌లో ఆడటం అనేది వారి ఫిట్నెస్ పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే బుమ్రా ఫిట్నెస్ టెస్టులో నెగ్గలేకపోవడంతో ఆయన స్థానంలో ఆకిబ్ నబీని జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కానీ సాయి సుదర్శన్ విషయంలో బోర్డు ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఆయన ఇంకా ఫిట్నెస్ క్లియర్ చేయాల్సి ఉందా లేక మరొక కారణంతో ఆగారా అనేది సస్పెన్స్‌గానే మారింది. రాబోయే రెండు రోజుల్లో సాయి సుదర్శన్‌పై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.
సాయి సుదర్శన్ టెస్టు కెరీర్ ట్రాక్ రికార్డ్
ఎడమచేతి వాటం బ్యాటర్ సాయి సుదర్శన్ ఇప్పటివరకు భారత్ తరఫున 7 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. 12 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన ఆయన 31.91 సగటుతో 383 రన్స్ సాధించారు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ఆయన అత్యధిక స్కోరు 87 పరుగులు. సుదర్శన్ టాప్ ఆర్డర్లో స్థిరంగా రాణించగల ఆటగాడు కావడంతో లంక పరిస్థితుల్లో ఆయన ఉంటే జట్టుకు ఎంతో బలమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
VIDEO | Mumbai: Indian cricket team departs for Colombo for the Test series against Sri Lanka.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/Arm0hHXcFK
— Press Trust of India (@PTI_News) August 4, 2026
భారత టెస్టు జట్టు, శ్రీలంక పర్యటన షెడ్యూల్
ఆగస్టు 07 నుంచి టీమిండియా శ్రీలంక XIతో 3 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఆగస్టు 15 నుంచి అసలు సిరీస్ మొదలవుతుంది.
శ్రీలంక టెస్టు సిరీస్‌కు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కె.ఎల్. రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ జైన్, ఆకిబ్ నబీ, సాయి సుదర్శన్ (ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది)*.
భారత్ vs శ్రీలంక మ్యాచ్‌ల షెడ్యూల్ (2026):
3 రోజుల వార్మప్ మ్యాచ్: ఆగస్టు 07 నుంచి 09 వరకు (భారత్ vs శ్రీలంక XI)
మొదటి టెస్టు మ్యాచ్: ఆగస్టు 15 నుంచి 19 వరకు (గాళ్ ఇంటర్నేషనల్ స్టేడియం, గాళ్)
రెండో టెస్టు మ్యాచ్: ఆగస్టు 23 నుంచి 27 వరకు (సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, కొలంబో)
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..