హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే తొలుత సమయం ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర ప్రజలు దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తు గడువును మరింత పెంచింది. ఈ మేరకు మరో 5 రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆగస్ట్ 15వ తేదీ వరకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. మొత్తంలో లక్ష ఇళ్లను నిర్మించాలని లక్ష్యం పెట్టుకోగా.. తొలి విడతగా కొన్ని ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇందుకోసం గత నెల 21వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ దరఖాస్తులు
ఆగస్ట్ 10వ తేదీ వరకు ఇచ్చిన గడువు ముగియగా.. ప్రజలకు మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో గడువు పొడిగించింది. వరుస సెలవులు రావడం, బొనాల పండుగ రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అర్హులైనవారందరికీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల సాయం అందించనుంది. నిరుపేదలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే హైదరాబాద్కు సంబంధించి కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇక ఆరు వేలకుపైగా దరఖాస్తులు కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి రాగా.. కూత్బుల్లాపూర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, అంబర్ పేట, మేడ్చల్, సనత్ నగర్, మల్కా్జ్ గిరి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, సికింద్రాబాద్ కంటోన్మెంట్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద మొత్తంలో దరఖాస్తు వచ్చాయి.
లాటరీ పద్దతిలో ఇళ్ల కేటాయింపు
అయితే దరఖాస్తులను అధికారులను క్షుణ్నంగా పరిశీలించనున్నారు. అనంతరం అర్హులను గుర్తించి లాటరీ పద్దతిలో ఇళ్లను కేటాయిస్తారు. పారదర్శకంగా, అర్హత ప్రమాణాల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక జరగనుంది. అయితే చివరితేదీ వరకు వేచి చూడకుండా అర్హులు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. మీ నియోజకవర్గ పరిధిలోని మీ సేవా సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తుతో పాటు రూ.10 వేల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇళ్లు మంజూరు కానివారికి ఈ నగదు రీఫండ్ అందిస్తారు. నగరంలో ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం వరంగా మారనుందని పొంగులేటి స్పష్టం చేశారు.