Headlines

KCR: ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్ | KCR Visits Peddi Sudarshan Reddy at Hospital, Appeals to Doctors to Save BRS Senior Leader

KCR: ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్ | KCR Visits Peddi Sudarshan Reddy at Hospital, Appeals to Doctors to Save BRS Senior Leader


​తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అందుతున్న చికిత్స గురించి డాక్టర్లతో మాట్లాడారు.. ​పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతున్న ఐసీయూ వార్డుకు చేరుకొని, డాక్టర్లతో కలిసి అక్కడ పెద్దికి అందుతున్న చికిత్స విధానాన్ని పరిశీలించారు. ​దాదాపు అరగంట సేపు అక్కడే నిలుచుని డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరును గురించి క్షుణ్ణంగా ఆరా తీశారు. కాగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రపంచ స్థాయి అత్యుత్తమ చికిత్సను అందిస్తున్నామని, అవసరమైన మేరకు విదేశాల నుంచి కూడా డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటున్నామని డాక్టర్లు తెలిపారు.
​గుండె ఊపిరితిత్తులు మిగతా అవయవాలు అన్ని పనిచేస్తున్నాయని కాకపోతే కొంత బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉన్నదని అందుకు మరో 48 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నదని డాక్టర్లు వివరించారు.

​ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో, స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు. ​కాగా.. ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ​ఐసీయూలో వైద్య చికిత్స విధానాన్ని పరిశీలించిన అనంతరం, కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్న కేసీఆర్, వారికి భరోసాను, ధైర్యాన్ని అందించారు.

​డాక్టర్ల కృషితో, దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆయన కోలుకుంటారని కేసీఆర్ విశ్వాసాన్ని ప్రకటించారు. ఆందోళన చెందవద్దని భార్యాపిల్లలకు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి గుండె ధైర్యం నింపారు. ​అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు. ​దాదాపు 45 నిమిషాల పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… ​”మీరేం చేస్తారో చేయండి.. కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి” అంటూ డాక్టర్లకు కేసీఆర్ చేతులెత్తి నమస్కరించారు.

​కాగా.. అమెరికా తదితర విదేశాల నుంచి డాక్టర్లతో మాట్లాడుతూ అవసరమైన సలహాలు తీసుకుంటూ, అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యవస్థలతో, సీనియర్ డాక్టర్లతో చికిత్సను అందిస్తున్నామని కేసీఆర్ కు డాక్టర్లు తెలిపారు. ​ఎప్పటికప్పుడు ఎంఆర్ఐ తదితర అవసరమైన పరీక్షలు చేస్తూ, డాక్టర్ల బృందం చేత సమావేశాలు నిర్వహించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే దిశగా అత్యున్నత చికిత్స అందిస్తున్నామని, డాక్టర్లు తెలిపారు. ​తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, దవాఖాన డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, ఎండి ఏఎస్ రావు, జెఎస్ రావు భరోసా ఇచ్చారు.

​ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు.. భార్య స్వప్న, కొడుకు నిదర్శన్ రెడ్డి, కూతురు ధర్మిష్ట, అన్నలు శ్రీనివాసరెడ్డి, రవీందర్ రెడ్డి, చెల్లెలు స్వాతి తదితరులతో మాట్లాడిన కేసీఆర్ వారికి ధైర్యాన్ని భరోసాను నింపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *