Headlines

New Rules: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న రూల్స్.. ఎల్పీజీ గ్యాస్ నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ల వరకు.. కొత్త నిబంధనలు తెలుసుకోండి.. | September 1 Rules: LPG, ITR, Fixed Deposits and International Travel Rules Set to Change


నెల మారుతుందంటే చాలు.. అనే కొత్త మార్పులు అమల్లోకి వస్తూ ఉంటాయి. ఆగస్ట్ ముగియడానికి మరో కొద్ది రోజులే ఉండగా.. సెప్టెంబర్ నెల వచ్చేస్తోంది. రాబోయే నెలలో దేశ ప్రజలను ఆర్ధికంగా ప్రభావితం చేసే అనేక కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. రోజువారీ ఖర్చులతో పాటు ఎల్పీజీ గ్యాస్ ధరలు, ఎల్పీజీ ఈకేవైసీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సంబంధించి మార్పులు వస్తున్నాయి. వీటిని ముందే తెలుసుకోవడం వల్ల మీరు జాగ్రత్త పడవచ్చు. తెలుసుకోకపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

ఆగస్ట్ 31తో ముగియనున్న గడువు

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ చేసుకునేందుకు ఆగస్ట్ 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించగా.. ఈ సారి మరో అవకాశం ఇవ్వకపోవచ్చు. దీంతో ఇంకా చేసుకోనివారు ఉంటే వెంటనే చేసుకోవడం మంచిది. లేకపోతే సెప్టెంబర్ 1 నుంచి గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించి ఇబ్బందులు ఎదురుకావొచ్చు.

మారనున్న గ్యాస్ ధరలు

ఇక ప్రతీ నెలా ఒకటో తేదీ కొత్త ఎల్పీజీ గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు ప్రకటిస్తూ ఉంటాయి. గత నెలలో కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించగా.. డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో సవరణలు చేయలేదు. దీంతో సెప్టెంబర్ 1న కొత్త గ్యాస్ ధరలను వెల్లడించనున్నారు. మరి ఈ సారి ఏమైనా మార్పులు ఉంటాయా.. లేదా స్థిరంగా ఉంచుతారా అనేది చూడాలి.

కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి వడ్డీ రేట్లలో సెప్టెంబర్ 1 నుంచి మార్పులు జరగనున్నాయి. రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న డిపాజిట్లకు సంబంధించి వడ్డీ రేట్ల వివరాలను ఉదయం 10.10 గంటల్లోపు తప్పనిసరిగా బ్యాంకులు తమ వెబ్ సైట్లలో పొందుపర్చాలి. ఒకే రోజున వేర్వేరు వడ్డీ రేట్లు, వేర్వేరు బ్రాంచుల్లో వేర్వురుగా వడ్డీ రేట్లను ఫిక్స్ చేయడానికి వీల్లేకుండా ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

ఐటీఆర్ గడువు పూర్తి

ఆగస్ట్ 31తో ఐటీఆర్ గడువు ముగుస్తుంది. ఆడిట్ అవసరం లేని వ్యక్తులు 2026-27 సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఆగస్ట్ 31 వరకు మాత్రమే సమయం ఉంది. దీంతో ఆలోపు దాఖలు చేయడం మంచిది.

బోర్డింగ్ పాస్‌పై నో స్టాంప్

ఇక దేశం నుంచి వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులకు ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద బోర్డింగ్ పాస్‌పై స్టాంప్ అవసరం లేదు. ఫోన్‌లో లేదా ప్రింట్ చేసిన కాపీని చూపిస్తే సరిపోతుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. దీని వల్ల ఇమిగ్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం అవ్వనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *