Headlines

Objection My Lord: అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ.. శ్రీకాంత్ కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉంది..? | Objection My Lord Web Series Review In Telugu Starrer Srikanth

Objection My Lord: అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ.. శ్రీకాంత్ కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉంది..? | Objection My Lord Web Series Review In Telugu Starrer Srikanth


వెబ్ సిరీస్ రివ్యూ: అబ్జెక్షన్ మై లార్డ్

నటీనటులు: శ్రీకాంత్, ముఖేష్ ఋషి, అనన్య శర్మ, స్నేహల్ కామత్, స‌మీర్‌, జెమిని సురేష్ తదితరులు

సినిమాటోగ్రఫీ: సూర్య

ఎడిటింగ్: కిషోర్

సంగీతం: అరుణ్ చిలువేరు

నిర్మాత: రాజ్ కుమార్ ఆకేళ్ల‌

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ అయ్యప్పన్

జీ5లో తాజాగా విడుదలైన వెబ్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’. సంతోష్ అయ్యప్పన్ రూపొందించిన ఈ సిరీస్ పూర్తిగా కోర్టు రూమ్ డ్రామా.. సస్పెన్స్ అంశాలతో వచ్చింది. మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

పరశురామ్ (శ్రీకాంత్) నోటరీ లాయర్. న్యాయ శాస్త్రం మీద ఎంత మంచి పట్టు ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల కోర్టుకు దూరంగా ఉంటాడు. కోర్టు బయట నోటరీలు రాసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఆ సమయంలో వేద (అనన్య శర్మ) పరశురాం దగ్గర అసిస్టెంట్గా చేరుతుంది. సరిగ్గా అదే సమయంలో నారాయణ కూతురు మీరా (స్నేహల్ కామత్) కిడ్నాప్ అవుతుంది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా కూడా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటాడు నారాయణ. ఇది పరుశురామ్ ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. మరోవైపు తండ్రిని ఒక ఫెయిల్యూర్ గా చూస్తూ అసహ్యించుకుంటాడు పరశురాం కొడుకు. ఆ సమయంలో నారాయణ కూతురు కేసు పరుశురాం టేకప్ చేస్తాడు. కోర్టులో అతడికి ప్రత్యర్థిగా లాయర్ విశ్వనాథ్ (ముఖేష్ ఋషి) వస్తాడు. దాన్ని పరిష్కరించే క్రమంలో పరశురామ్‌కు ఎలాంటి నిజాలు తెలిశాయి. బలమైన వ్యక్తులను ఎదిరించి ఈ పోరాటంలో ఆయన ఎలా గెలిచారు అనేది ఈ సిరీస్ ప్రధాన ఇతివృత్తం.

కథనం:

దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ ఎంచుకున్న పాయింట్ బాగుంది, దానిని తెరపై ఆవిష్కరించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. మొదటి ఎపిసోడ్ నుంచే అసలు కథలోకి తీసుకెళ్లి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. కేసు విచారణలో ఒక్కో చిక్కుముడి వీడుతున్న కొద్దీ సిరీస్ ఉత్కంఠభరితంగా మారుతుంది. అయితే మొదట్లో ఉన్న ఆ బిగువు తర్వాత మెల్లగా సడలినట్టు అనిపించింది. దాని మీద కూడా బ్రోకర్ చేసి ఉంటే ఈ సిరీస్ ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్ళేది. అయినా కూడా దర్శకుడు ఎక్కడ బోర్ కొట్టకుండా జాగ్రత్తపడ్డాడు. ముఖ్యంగా కోర్టులో జరిగే వాదోపవాదాలు, లీగల్ అంశాలను చాలా సహజంగా తీర్చిదిద్దారు. ఎక్కడా అనవసరమైన యాక్షన్ సన్నివేశాలకు తావు ఇవ్వకుండా కేవలం మైండ్ గేమ్, సస్పెన్స్ మీదే దృష్టి పెట్టడం ఈ సిరీస్‌కు అతిపెద్ద బలం.

కొన్ని చోట్ల తర్వాత ఏం జరగబోతుందనేది ముందే ఊహించేలా సీన్స్ ఉండటం కాస్త నిరాశపరుస్తుంది. అలాగే కొన్ని ఎపిసోడ్స్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తాయి. ఆయా సన్నివేశాలను ఇంకాస్త షార్ప్‌గా కట్ చేసి ఉంటే సిరీస్ వేగం మరింత పెరిగేది. అయినా సరే ఎప్పటికప్పుడు వచ్చే కొత్త మలుపులు, ఒకదాని తర్వాత ఒకటి రివీల్ అయ్యే సీక్రెట్స్ వీక్షకులను బోర్ కొట్టించకుండా చివరిదాకా కూర్చోబెడతాయి. పాత పాయింట్ తీసుకున్న కూడా దాన్ని చాలా కొత్తగా ప్రజెంట్ చేయడానికి దర్శకుడు సంతోష్ తన వంతు ప్రయత్నించాడు. కోర్టు వాదనలు, కేసుల సంబంధించిన కథలు ఉన్నప్పుడు ఇంకాస్త పకడ్బందీ స్క్రీన్ ప్లే ఉంటే బాగుంటుంది. ఆ విషయంలో అబ్జెక్షన్ మై లార్డ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. భారీ యాక్షన్, హంగులు ఆశించకుండా కేవలం బలమైన కథ, ఉత్కంఠభరితమైన కోర్టు రూమ్ వాదనలు ఇష్టపడే వారికి అబ్జెక్షన్ మై లార్డ్ ఒక మంచి ఛాయిస్. అక్కడక్కడ కాస్త స్కిప్ చేసిన కూడా.. ఈ వీకెండ్‌లో ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని చూడదగ్గ సిరీస్ ఇది.

నటీనటులు:

ఈ లీగల్ డ్రామాకు శ్రీకాంత్ నటన ప్రాణం పోసింది. చాలా కాలం తర్వాత ఆయనకు ఒక అద్భుతమైన, పరిణితి చెందిన పాత్ర దక్కింది. తన అనుభవాన్నంతా రంగరించి పరశురామ్ పాత్రలో ఒదిగిపోయారు. ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో ముఖేష్ రుషి తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టారు. అనన్య, స్నేహల్, సమీర్ తదితరులు తమ పరిధి మేర నటించి కథకు మంచి బలాన్ని చేకూర్చారు.

టెక్నికల్ టీం:

టెక్నికల్ పరంగా ఈ సిరీస్ ఉన్నతంగా ఉంది. కోర్టు సన్నివేశాల్లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కెమెరా వర్క్ చాలా నీట్‌గా, ప్రొఫెషనల్‌గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఎక్కడా రాజీ పడకుండా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదనిపించినా కొన్ని సాగదీత సీన్ల మీద కత్తెర వేయాల్సింది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా అబ్జెక్షన్ మై లార్డ్.. డీసెంట్ కోర్ట్ రూమ్ డ్రామా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *