ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మూవీ లవర్స్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అదేంటంటే.. త్వరలోనే రెండు సూపర్ హిట్ తెలుగు సినిమాలు నెట్ ఫ్లిక్స్ లైబ్రరీ నుంచి డిలీట్ కానున్నాయి. 2019లో కేవలం నెల రోజుల తేడాతో థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. స్టార్ హీరోలు లేకున్నా కేవలం కంటెంట్ తోనే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఆపై ఓటీటీలోనూ భారీ వ్యూయర్ షిప్ సొంతం చేసుకున్నాయి. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కాంట్రాక్ట్ ముగియడంతో ఇప్పుడీ సినిమాలు ఓటీటీ నుంచి అదృశ్యం కానున్నాయి. అందులో మొదటగా తాప్సీ పన్ను నటించిన ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ ఓవర్’ ఆగస్టు 12, 2026న నెట్‌ఫ్లిక్స్ నుంచి వెళ్లిపోనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 2, 2026 నాటికి సమంత సూపర్ హిట్ సినిమా ‘ఓ బేబీ’ నెట్ ఫ్లిక్స్ లైబ్రరీ నుంచి కనుమరుగవుతుంది. కేవలం తెలుగు, తమిళ ఒరిజినల్ వెర్షన్లు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో అందుబాటులో ఉన్న డబ్బింగ్ వెర్షన్లను కూడా ఓటీటీ నుంచి పూర్తిగా డిలీట్ కానున్నాయి.
గేమ్ ఓవర్ సినిమా విషయానికి వస్తే.. డైరెక్టర్ అశ్విన్ శరవణన్ ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు.
పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడుతూ వీల్‌చైర్‌కే పరిమితమైన అమ్మాయిగా తాప్సీ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సమంత ‘ఓ బేబీ’ సినిమా విషయానికి వస్తే.. ఇటీవలే మా ఇంటి బంగారం సినిమా వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన నందినీ రెడ్డే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు. 70 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువతిగా మారే ఈ ఫాంటసీ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. సమంత కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆమెతో పాటు హీరో నాగ శౌర్య, తేజ సజ్జా, సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.