Headlines

Paddy Cultivation: ఒక ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..? పూర్తి లెక్కలివే..! | Paddy Cultivation Investment: Per Acre Costs, amp; Farmer Struggles


Paddy Cultivation: భారతదేశంలో వ్యవసాయ రంగం, ముఖ్యంగా వరి సాగు, కోట్లాది మంది ప్రజలకు అన్నం పెడుతుంది. అయితే, మనకు అన్నం పెట్టే రైతు ఈ ప్రక్రియలో ఎంత కష్టపడతాడు. ఎంత పెట్టుబడి పెడతాడనేది చాలామందికి తెలియదు. ఒక ఎకరం వరి పంటను పండించడానికి విత్తనం వేసిన రోజు నుండి కోత కోసే వరకు రైతు పెట్టే పెట్టుబడి, పడే కష్టాలు చాలా ఉంటాయి. ఈ కథనం ఒక ఎకరం వరి సాగుకు అయ్యే సుమారు ఖర్చులను దశలవారీగా తెలుసుకుందాం..

1. పొలం దున్నడం (దుక్కి):

వరి సాగుకు మొదటి దశ పొలాన్ని సిద్ధం చేయడం. ట్రాక్టర్‌తో దున్నించడానికి ఒక ఎకరానికి సుమారు రూ. 3,000 నుంచి రూ. 6,000 వరకు ఖర్చు అవుతుంది. ఇది నేల స్వభావం, దున్నే పద్ధతి, ట్రాక్టర్ అద్దెపై ఆధారపడి మారుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఏరియాను బట్టి ధర ఉంటుంది. ఒక్కో గ్రామంలో ఒక్కో ధరలు ఉంటాయని గమనించండి. ఇందులో ఎక్కువ కావచ్చు.. తక్కువ కావచ్చు. ఇవి కేవలం అంచనా ప్రకారమే అందిస్తున్నాము.

2. విత్తనాలు:

మంచి నాణ్యత గల విత్తనాలను ఎంచుకోవడం పంట దిగుబడికి కీలకం. ఒక ఎకరానికి సరిపడా వరి విత్తనాలను కొనుగోలు చేయడానికి రూ. 2,000 నుంచి రూ. 4,000 వరకు అవసరం పడుతుంది. నాణ్యమైన విత్తనాలతోనే మంచి పంట ఆశించవచ్చు.

3. నారు నాటడం (నాట్లు):

విత్తనాలు నానబెట్టి, మొలకెత్తించి, నారు పోసి, ఆ నారును పొలంలో నాటడానికి చాలామంది కూలీల అవసరం ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియకు, కూలీల వేతనాలతో కలిపి, రూ. 8,000 నుంచి రూ. 15,000 వరకు ఖర్చు అవుతుంది. ఇది వరి సాగులో ఒక ముఖ్యమైన ఖర్చు. కూలీల ఖర్చు డిమాండ్‌ను బట్టి పెరగవచ్చు.

4. ఎరువులు, పురుగుమందులు, కలుపు నివారణ:

పంట పెరుగుదలకు, చీడపీడల నివారణకు ఎరువులు, పురుగుమందులు, కలుపు నివారణ మందులు తప్పనిసరి. వీటితో పాటు పంట సంరక్షణకు అవసరమైన ఇతర ఖర్చులు కలిపి రూ. 8,000 నుంచి రూ. 15,000 వరకు అవుతుంది. పంట ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ పెట్టుబడి అత్యవసరం.

5. నీటిపారుదల ఖర్చులు:

వరి పంటకు నీరు సమృద్ధిగా అవసరం. నీటిపారుదల కోసం మోటార్‌లు, బోర్లు వాడాల్సి వస్తే కరెంటు బిల్లులు లేదా డీజిల్ ఖర్చులు అవుతాయి. వీటి కోసం రూ. 3,000 నుంచి రూ. 8,000 వరకు ఖర్చు అవుతుంది. వర్షాలు సరిపడనప్పుడు ఈ ఖర్చులు మరింత పెరుగుతాయి.

6. పంట కోత, రవాణా, లోడింగ్:

పంట పండిన తర్వాత కోత కోయడానికి హార్వెస్టర్ ఖర్చులు, పండిన ధాన్యాన్ని పొలం నుండి మార్కెట్‌కు లేదా నిల్వకు తరలించడానికి రవాణా ఖర్చులు, లోడింగ్ ఖర్చులు కలిపి రూ. 6,000 నుంచి రూ. 12,000 వరకు అవసరం పడుతుంది.

మొత్తం పెట్టుబడి, రైతు కష్టాలు:

పై ఖర్చులను గమనిస్తే, ఒక ఎకరం వరి పంటను పూర్తిగా సాగు చేయడానికి రైతుకు మొత్తం రూ. 35,000 నుంచి రూ. 60,000 వరకు, కొన్ని ప్రాంతాల్లో భూమి స్వభావం, కూలీల లభ్యత, వాతావరణ పరిస్థితుల ఆధారంగా అంతకంటే ఎక్కువ కూడా ఖర్చు అవుతుంది.

అయితే, రైతు కష్టం ఇక్కడితో పూర్తి కాదు. వర్షాలు సరిగ్గా పడకపోయినా, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, పురుగుల బెడద తీవ్రమైనా, లేదా మార్కెట్‌లో వరి ధరకు గిట్టుబాటు ధర లభించకపోయినా, రైతు పెట్టిన పెట్టుబడి మొత్తం ప్రమాదంలో పడుతుంది. కొన్నిసార్లు లాభం రావడం పక్కన పెడితే, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక, అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. మనం తినే ప్రతి బియ్యం గింజ వెనుక రైతు చెమట, కష్టం, ఆశలు, వారి కుటుంబ భవిష్యత్తు దాగి ఉన్నాయి. అందుకే అన్నాన్ని ఎప్పుడూ వృథా చేయకూడదు. రైతును గౌరవించాలి. రైతు ఉంటేనే మనకు అన్నం ఉంటుంది. జై కిసాన్! అన్నదాత సుఖీభవ! అనేది కేవలం నినాదం కాదు, మనందరి బాధ్యత.

ఇది కూడా చదవండి: Wood vs UPVC Windows: వుడ్ విండోస్ వర్సెస్ యూపీవీసీ విండోస్.. తక్కువ ఖర్చులో మీ ఇంటికి ఏది బెస్ట్‌..!

ఇది కూడా చదవండి: మొక్క జొన్న ఉడకబెట్టి తినడం మంచిదా? కాల్చి తినడం మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *