Headlines

Sachin Tendulkar : ఏంటీ.. సచిన్ ఇండియా కంటే ముందు పాకిస్థాన్ తరఫున క్రికెట్ ఆడారా? | Sachin Tendulkar Once Fielded for Pakistan at Age 13 Before Making India Debut The Untold 1987 Story

Sachin Tendulkar : ఏంటీ.. సచిన్ ఇండియా కంటే ముందు పాకిస్థాన్ తరఫున క్రికెట్ ఆడారా? | Sachin Tendulkar Once Fielded for Pakistan at Age 13 Before Making India Debut The Untold 1987 Story


Sachin Tendulkar : క్రికెట్ ప్రపంచంలో గాడ్ ఆఫ్ క్రికెట్‎గా పేరొందిన సచిన్ టెండూల్కర్ టీమిండియా తరఫున ఎన్నో మరుపురాని రికార్డులు సృష్టించారు. బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన సచిన్, కొన్నిసార్లు బౌలింగ్‌తోనూ అద్భుతాలు చేశారు. అయితే ఆయన భారత జట్టులోకి అడుగుపెట్టడానికి రెండు సంవత్సరాల ముందే పాకిస్థాన్ జాతీయ జట్టు తరఫున ఫీల్డింగ్ చేశారనే విషయం చాలా మందికి తెలియదు. 1987లో కేవలం 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సచిన్ పాకిస్థాన్ గ్రీన్ జెర్సీ ధరించి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి అడుగుపెట్టారు.

ముంబై బ్రాబోర్న్ స్టేడియంలో ఏం జరిగింది?

1987లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించిన సమయంలో ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఒక ఫ్రెండ్లీ 40 ఓవర్ల ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. లంచ్ బ్రేక్ సమయంలో పాకిస్థాన్ దిగ్గజ ఆటగాళ్లు జావేద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్ మైదానం వీడారు. దాంతో ఫీల్డర్ల కొరత ఏర్పడటంతో నాటి పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ నాటి సీసీఐ డ్రెస్సింగ్ రూమ్ ఇన్ఛార్జ్ హేమంత్ కేంకరేను కలిసి ఫీల్డింగ్ కోసం ఇద్దరు లోకల్ కుర్రాళ్లను పంపాల్సిందిగా కోరారు. హేమంత్ ఇతరుల కోసం చూసేలోపే ఎంతో ఉత్సాహంగా ఉన్న 13 ఏళ్ల సచిన్ టెండూల్కర్ వెంటనే పరుగెత్తుకుంటూ మైదానంలోకి వెళ్లి పాకిస్థాన్ ఆటగాళ్లతో కలిసిపోయారు.

కపిల్ దేవ్ కొట్టిన షాట్‌ను ఆపిన చిన్నారి సచిన్

మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో నాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్ కొట్టిన ఒక షాట్ సచిన్ వైపుగా వచ్చింది. సచిన్ ఆ బంతిని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మ్యాచ్ అనంతరం తన చిన్ననాటి స్నేహితుడు మార్కస్ కూటోతో కలిసి ముంబై లోకల్ ట్రైన్‌లో ఇంటికి వెళ్తున్నప్పుడు సచిన్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసినట్లు కూటో గుర్తుచేసుకున్నారు. తానెంతో ఆశగా ఫీల్డింగ్‌కు వెళ్తే తనను లాంగ్ బౌండరీ లైన్ దగ్గర నిలబెట్టారని, సిక్సర్లుగా వెళ్లే బంతులను క్యాచ్ పట్టడం ఎలా సాధ్యమవుతుందని సచిన్ అమాయకంగా బాధపడ్డాడట. ఆ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సచిన్ ఆటోబయోగ్రఫీలో ఆసక్తికర విషయాలు

ఈ అరుదైన సంఘటన గురించి సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకంలో కూడా స్పష్టంగా ప్రస్తావించారు. “నేను ఒకప్పుడు ఆయన పాకిస్థాన్ జట్టు తరఫున ఫీల్డింగ్ చేశాననే విషయం ఇమ్రాన్ ఖాన్‌కు గుర్తో లేదో కూడా నాకు తెలియదు” అని సచిన్ రాసుకొచ్చారు. ఈ ఘటన జరిగిన రెండేళ్లకే, అంటే 1989లో సచిన్ భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించి, ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి దిగ్గజ బౌలర్లను అంతర్జాతీయ క్రికెట్‌లో నేరుగా ఎదుర్కొని చరిత్ర సృష్టించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *