Headlines

Tamil Nadu: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన త్రిష.. ఏఐఏడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు! | Tamil Nadu: Actress Trisha Taunts To Target CM Vijay After Udhayanidhi Stalin, This Time AIADMK Leader Udhayakumar

Tamil Nadu: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన త్రిష.. ఏఐఏడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు! | Tamil Nadu: Actress Trisha Taunts To Target CM Vijay After Udhayanidhi Stalin, This Time AIADMK Leader Udhayakumar


తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష పేరు మరోసారి తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత జోసఫ్ విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఏఐఏడీఎంకే సీనియర్ నేత ఆర్.బి. ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయ్‌తో త్రిషకు ఉన్నట్లు ప్రచారంలో ఉన్న వ్యక్తిగత సంబంధాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై త్రిష అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టు 8న తూత్తుకుడిలో జరిగిన జయలలిత పెరవై సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఉదయకుమార్.. విజయ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ త్రిష పేరును ప్రస్తావించినట్లు కథనాలు వెలువడ్డాయి. “విజయ్ ప్రియమైన త్రిషను ఉప ముఖ్యమంత్రిగా ఎప్పుడు నియమిస్తారో తమిళనాడు ఎదురుచూస్తోంది” అంటూ ఆయన వ్యాఖ్యానించి రాజకీయ దుమారానికి అజ్యం పోశారు. కావేరీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రభుత్వ విధానాలపై రాజకీయ విమర్శ చేయాల్సిన సందర్భంలో ఓ మహిళా సినీ ప్రముఖురాలి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

ఉదయకుమార్ వ్యాఖ్యలపై త్రిష అభిమానులు తీవ్రంగా స్పందించారు. మదురైలోని పలు ప్రాంతాల్లో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ త్రిష ఫ్యాన్స్ అసోసియేషన్ పోస్టర్లు ఏర్పాటు చేశాయి. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి సినీ నటుల వ్యక్తిగత జీవితాలను ఉపయోగించుకోవడం సరికాదని అభిమానులు మండిపడుతున్నారు.

ఇప్పటికే త్రిషపై రాజకీయ వేదికల నుంచి వచ్చిన వ్యాఖ్యలు తమిళనాడులో వరుస వివాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు మరోసారి అదే చర్చను ముందుకు తెచ్చాయి. ఇదే అంశానికి కొనసాగింపుగా గత వారం డీఎంకే నాయకుడు, ప్రస్తుత ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర వివాదానికి దారితీశాయి. కావేరీ జలాలపై జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు త్రిష పేరుతో నినాదాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనికి ఉదయనిధి ద్వంద్వార్థం వచ్చేలా స్పందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ వ్యాఖ్యలపై టీవీకే మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేయగా, విచారణ తర్వాత ఆయన విడుదలయ్యారు. అయితే తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్య చేయలేదని ఉదయనిధి ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని డీఎంకే కూడా వాదించింది.

విజయ్-త్రిష పేర్లు ఎందుకు తెరపైకి వస్తున్నాయి?

సినీ రంగంలో విజయ్, త్రిష కలిసి నటించిన సినిమాలు, వారి మధ్య స్నేహం గురించి గతంలో వచ్చిన వార్తల నేపథ్యంలో ఇద్దరి పేర్లు తరచూ సోషల్ మీడియాలో చర్చకు వస్తుంటాయి. అయితే వ్యక్తిగత సంబంధాలపై వచ్చిన ఊహాగానాలకు ఇద్దరూ అధికారికంగా ఎలాంటి నిర్ధారణ ఇవ్వలేదు. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి TVKను స్థాపించిన తర్వాత ఈ అంశం రాజకీయ ప్రత్యర్థులకు విమర్శల అస్త్రంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్.. విజయ్ రాజకీయ ప్రయాణాన్ని విమర్శించే క్రమంలో త్రిష పేరును ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో త్రిష తరఫున ఆమె న్యాయ బృందం స్పందించింది.

సినిమా నుంచి రాజకీయాల దాకా..

విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమిళనాడులో సినిమా, రాజకీయాలు మరోసారి బలంగా కలిసిపోతున్నాయి. TVK ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు ప్రభుత్వ కమిటీల్లో చోటు దక్కడం ప్రతిపక్ష విమర్శలకు కారణమవుతోంది. నిర్మాత అర్చన కలపధినిని తమిళనాడు హిందూ మత, ధార్మిక దానాల శాఖకు సంబంధించిన ప్రత్యేక రాష్ట్ర స్థాయి కమిటీలో నియమించడం కూడా ఇదే రాజకీయ చర్చలో భాగంగా ప్రస్తావనకు వచ్చింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే క్రమంలో వ్యక్తిగత సంబంధాలు, సినీ ప్రముఖుల పేర్లను రాజకీయ విమర్శల్లోకి తీసుకురావడం తమిళనాడులో కొత్త రాజకీయ చర్చకు దారితీస్తోంది.

రాజకీయ విమర్శలకు హద్దులు ఎక్కడ?

తాజా వివాదం కేవలం త్రిష పేరు చుట్టూ తిరిగే రాజకీయ దుమారం మాత్రమే కాదు. ప్రత్యర్థి నాయకుడిని విమర్శించడానికి మహిళల వ్యక్తిగత జీవితాలను ప్రస్తావించడం సరైన రాజకీయ పద్ధతేనా? అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ప్రభుత్వ విధానాలు, కావేరీ జలాల సమస్య, పరిపాలనా వైఫల్యాలు వంటి అంశాలపై ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు ఉన్నప్పటికీ.. వ్యక్తిగత సంబంధాలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడం ప్రజా చర్చ నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరోవైపు TVK కూడా ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మహిళా విభాగం ద్వారా ఫిర్యాదులు, నిరసనలు మొదలైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశముంది.

మొత్తంగా.. త్రిష పేరు మరోసారి తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్‌పై రాజకీయ విమర్శల మధ్య ఆమె పేరును ప్రస్తావించడం.. ఇప్పుడు అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య కొత్త రాజకీయ అగ్గిని రాజేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *