Headlines

Telangana: ఎరక్కపోయి ఇరుక్కుపోయిన పాము.. చిరవకు ఏమైందంటే..? | Snake head stuck in energy drink can rescued by forest officials

Telangana: ఎరక్కపోయి ఇరుక్కుపోయిన పాము.. చిరవకు ఏమైందంటే..? | Snake head stuck in energy drink can rescued by forest officials


“ఎరక్కపోయి ఇరుక్కోవడం” అనే సామెతను మనం తరచూ వింటుంటాం. అలాంటి పరిస్థితినే ఓ పాము ఎదుర్కొంది. ఆహారం కోసం వెళ్లిందో, లేక దాహం తీర్చుకునేందుకు ఖాళీగా పడివున్న టిన్‌లోకి తల పెట్టిందో తెలియదు కానీ, చివరకు ఎనర్జీ డ్రింక్ ఖాళీ టిన్‌లో తల ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు పడింది. ఈ అరుదైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ ప్రాజెక్టు సమీపంలో చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం, ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో ఓ పాము తలపై ఎనర్జీ డ్రింక్ ఖాళీ టిన్ ఇరుక్కుపోయిన స్థితిలో కనిపించింది. టిన్ నుంచి బయటపడేందుకు అది చాలాసేపు అటూ ఇటూ తిరుగుతూ తీవ్రంగా ప్రయత్నించింది. తలను బలంగా విదిలించడం, నేలపై రుద్దుకోవడం వంటి ప్రయత్నాలు చేసినప్పటికీ టిన్ మాత్రం విడిపోలేదు. దీంతో పాము దిక్కుతోచని స్థితిలో నరకయాతన అనుభవించింది.

ఈ దృశ్యాలను గమనించిన స్థానికులు వెంటనే తమ సెల్‌ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అత్యంత జాగ్రత్తగా పామును అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి గాయాలు కాకుండా ప్రత్యేక పరికరాల సహాయంతో టిన్‌ను తొలగించి పామును సురక్షితంగా బయటకు తీశారు. తల విడిపించగానే పాము మళ్లీ స్వేచ్ఛగా కదలడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దానిని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

ఈ ఘటన మరోసారి పర్యావరణంపై నిర్లక్ష్యంగా పడేస్తున్న ప్లాస్టిక్, టిన్లు, గాజు సీసాలు వంటి వ్యర్థాలు అడవి జీవులకు ఎంతటి ప్రమాదంగా మారుతున్నాయో గుర్తు చేసింది. మనం నిర్లక్ష్యంగా పారేసే చెత్త వల్ల మూగజీవులు ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకుంటున్నాయని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచడం, వాడిన వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా సక్రమంగా పారవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *