Headlines

Telangana: తెలుగు రాష్ట్రాల మధ్య మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. వారం రోజుల్లో ప్రారంభం.. ఈ ప్రాంతాల మీదుగా.. | Khammam to Devarapalli NH 365BG Nears Completion, Opening Expected Within Days

Telangana: తెలుగు రాష్ట్రాల మధ్య మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. వారం రోజుల్లో ప్రారంభం.. ఈ ప్రాంతాల మీదుగా.. | Khammam to Devarapalli NH 365BG Nears Completion, Opening Expected Within Days


తెలుగు రాష్ట్రాల ప్రజలకు సూపర్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక నేషనల్ హైవేలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇవి తెలుగు రాష్ట్రాల్లో ప్రజా రవాణాను వేగవంతం చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా రోడ్డు కనెక్టివిటీ అందిస్తున్నాయి. ఇక మరికొన్ని కొత్త హైవేలు నిర్మాణం దశలో ఉండగా.. అందులో ఒకటి త్వరలో అందుబాటులోకి రానుంది. ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మించిన యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దీంతో మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో దీనిని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ హైవేకు ఎన్‌హెచ్ 365బీజీగా నామకరణం చేశారు. కొంతకాలం క్రితం నుంచి వైరా నుంచి దేవరపల్లి మధ్య వాహనాలను అనుమతించగా.. ఇప్పుడు పెండింగ్ పనులు కూడా పూర్తవ్వడంతో పూర్తిస్థాయిలో వాహనాలను అనుమతించనున్నారు.

ఇప్పటికే రోడ్లు, వంతెనల నిర్మాణం పూర్తవ్వగా.. ధ్వంసలాపురం సమీపంలో రైల్వే ట్రాక్‌పై రోడ్ ఓవర్ బ్రిడ్జి పనుల్లో జాప్యం జరిగింది. ఇప్పుడు ఎడమవైపు ఆర్వోబీ నిర్మాణం కూడా పూర్తి కావడంతో రాకపోకలను అనుమతించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఈ హైవే ఖమ్మం జిల్లాలో 105 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ పనుల కోసం 3 ప్యాకేజీలుగా రూ.2123 కోట్ల వ్యయం ఖర్చు పెట్టారు. ఈ జాతీయ రహదారిపై 80,100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. దీని వల్ల హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు జర్నీ భారీగా తగ్గనుంది. దాదాపు 56 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. తరచుగా హైదరాబాద్ నుంచి వేలాదిమంది విశాఖపట్నం వెళ్తుంటారు. వీరికి వేగవంతమైన ప్రయాణాన్ని అందించనుంది. పనులు పూర్తి కావడంతో ఆగస్ట్ 1 నుంచే పూర్తిస్థాయిలో ఈ రహదారిని ప్రారంభించాలని అధికారులు తొలుత భావించారు. కానీ రెండు, మూడు రోజులు ఆలస్యం కానుంది.

ఈ హైవేపై అత్యాధునిక టోల్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ఓఆర్ఆర్ తరహాలో టోల్ వ్యవస్థ ఉంటుంది. మీరు హైవేపై ఎంత దూరమైతే ప్రయాణం చేశారో.. అంత దూరానికి మాత్రమే టోల్ వసూలు చేస్తారు. వాహనం ఎంట్రీ, ఎగ్జిట్ వరకు ఉండే దూరాన్ని బట్టి టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక ప్రతీ కిలోమీటర్‌కు ఒక సీసీ కెమెరా ఉంటుంది. దీంతో హైవేపై భద్రత పటిష్టంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వందనం, చౌడవరం సమీపంలో భారీ వాహనాల కోసం ట్రక్ లే బైలు ఏర్పాటు చేశారు. సూర్యాపేట వైపు నుంచి వచ్చే వెహికల్స్ ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లి టోల్ గేట్ కూడా గ్రీన్‌ఫీల్డ్ హైవేలోకి ఎంట్రీ అవుతాయి. దేవరపల్లి సమీపంలో ఎగ్జిట్ గేటు ఉంటుంది. అమరావతి నుంచి నాగపూర్ వెళ్లే హైవేతో ఈ జాతీయ రహదారిని అనుసంధానం చేశారు. వందనం-కొదుమూరు వద్ద ఇది అనుసంధానం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *