Headlines

Telangana: మళ్లీ వాన జోరు.. హైదరాబాద్‌లో మరో గంట వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్! | Telangana Weather Update: Districts on High Alert for Heavy Rains; Hyderabad Monsoon Forecast


తెలంగాణలో వర్షాలు మరోసారి జోరందుకునే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 25న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వర్షాల తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉండగా.. సాయంత్రం, రాత్రి వేళల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు వర్షాలు కొనసాగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

గత 24 గంటల్లో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. మెదక్ జిల్లా శంకరంపేట (ఏ)లో అత్యధికంగా 110 మి.మీ. వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌లో 80.5 మి.మీ., సిర్గాపూర్‌లో 77.8 మి.మీ., వికారాబాద్ జిల్లా యాలాల్‌లో 77.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సీజన్ మొత్తం వర్షపాతం 457.6 మి.మీ.గా ఉండగా.. సాధారణ వర్షపాతం 524.8 మి.మీ.తో పోలిస్తే 13 శాతం లోటు కొనసాగుతోంది.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!

సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ వర్ష సూచన ఉంది. ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ, మధ్య, తూర్పు తెలంగాణలో రాత్రి వేళ వర్షాల తీవ్రత పెరగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

హైదరాబాద్‌లో మరో గంట వర్షాలు

హైదరాబాద్‌లో ఆకాశం ఎక్కువగా మేఘావృతంగా ఉండగా.. నగరంలో మరో గంటపాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, బాలానగర్ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. సికింద్రాబాద్, బేగంపేట, ముషీరాబాద్, అంబర్‌పేట్, నాంపల్లి, హిమాయత్‌నగర్, ఉప్పల్, నాగోల్, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లోనూ వర్ష సూచన ఉంది. పలు ప్రాంతాల్లో 10–15 నిమిషాల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురవకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి నుంచి ఉదయం వరకు వర్ష పరిస్థితులను ప్రజలు గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం మంచిది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *