Headlines

TGSPDCL: వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్! | Hyderabad News: TGSPDCL to Construct Substation Beneath Flyover Amid Land Shortage

TGSPDCL: వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్! | Hyderabad News: TGSPDCL to Construct Substation Beneath Flyover Amid Land Shortage


నగరంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటు కోసం భూమి కొరత తీవ్ర సవాల్‌గా మారిన నేపథ్యంలో తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై సాంకేతికంగా అనుకూలమైన ఫ్లైఓవర్లు, స్టీల్ బ్రిడ్జిల కింద ఖాళీ స్థలాలను వినియోగించి ఆధునిక ఇండోర్ విద్యుత్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రయోగానికి ముషీరాబాద్‌లోని నాయని నరసింహారెడ్డి స్టీల్ ఫ్లైఓవర్ కింద తొలి అడుగు పడనుంది.

గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం, లోడ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త సబ్‌స్టేషన్ల అవసరం తప్పనిసరిగా మారిందని టీజీఎస్‌పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేశ్ వి. పాటిల్ తెలిపారు. అయితే నగరంలోని కీలక ప్రాంతాల్లో భూమి అందుబాటులో లేకపోవడం, ఉన్న భూముల ధరలు భారీగా ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించామని చెప్పారు.

ఇందులో భాగంగానే ఇలా ఫ్లైఓవర్‌ల కింద సబ్‌ స్టేషన్‌ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. సోమవారం ముషీరాబాద్ బస్ డిపో సమీపంలోని నాయని నరసింహారెడ్డి స్టీల్ ఫ్లైఓవర్ 63, 64 స్తంభాల మధ్య ప్రతిపాదిత 33/11 కేవీ ఇండోర్ సబ్‌స్టేషన్ స్థలాన్ని సీఎండీ జితేశ్ పాటిల్, ప్రాజెక్టుల డైరెక్టర్ వి. శివాజీ పరిశీలించారు. సబ్‌స్టేషన్ లేఅవుట్, 33 కేవీ ఇన్‌కమింగ్ లైన్, 11 కేవీ అవుట్‌గోయింగ్ ఫీడర్లు, భూగర్భ కేబుళ్లు, భద్రతా ప్రమాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సబ్‌స్టేషన్‌ను పూర్తిగా ఆధునిక సాంకేతికతతో కూడిన అన్‌మ్యాన్డ్ ఇండోర్ సబ్‌స్టేషన్గా అభివృద్ధి చేయనున్నారు. రిమోట్ టెర్మినల్ యూనిట్ (RTU) ద్వారా సబ్‌స్టేషన్ పనితీరును దూరం నుంచే పర్యవేక్షించడంతో పాటు అవసరమైన ఆపరేషన్లు కూడా రిమోట్‌గానే నిర్వహించేలా ఏర్పాటు చేయనున్నారు. ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం అధిక లోడ్‌ను భరిస్తున్న ముషీరాబాద్ పరిసర ప్రాంతాల ఐదు 33/11 కేవీ సబ్‌స్టేషన్లపై భారం గణనీయంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు. దీంతో ముషీరాబాద్‌తో పాటు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత నాణ్యంగా, అంతరాయం లేకుండా అందే అవకాశం ఉంది.

ప్రతిపాదిత ఇండోర్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సుమారు రూ.10 నుంచి రూ.12 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఇదే సమయంలో నగరంలో సంప్రదాయ సబ్‌స్టేషన్ కోసం భూమి కొనుగోలు చేయాలంటే ఒక్క భూమికే రూ.8 నుంచి రూ.10 కోట్లు ఖర్చయ్యే పరిస్థితి ఉందని సీఎండీ వివరించారు. ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలాలను వినియోగించడం వల్ల భూమి కొనుగోలు వ్యయం తగ్గడమే కాకుండా నగరంలో స్థలాభావ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా విద్యుత్ ఐసోలేషన్, ఎర్తింగ్, ఇన్సులేషన్, రక్షణ వ్యవస్థలను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణం నుంచి విద్యుదీకరణ వరకు అన్ని దశల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించి, అన్ని పరీక్షలు పూర్తైన తర్వాతే సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

ముషీరాబాద్ ఇండోర్ సబ్‌స్టేషన్‌ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎండీ జితేశ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే భూమి కొరత ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా ఇండోర్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుపై సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *