Vaibhav Sooryavanshi 7 Records: భారత క్రికెట్లో మరో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. సమస్తిపుర్ నుంచి వచ్చిన ఈ 15 ఏళ్ల బ్యాటర్ అతి చిన్న వయసులోనే అరుదైన ఘనతలు సాధిస్తూ దూసుకెళ్తున్నాడు. అండర్-19 క్రికెట్ నుంచి ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్, దులీప్ ట్రోఫీ వరకు తనదైన ముద్ర వేసిన వైభవ్.. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 7 చారిత్రక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
అండర్-19లోనే చరిత్ర..: వైభవ్ రికార్డుల వేట అండర్-19 స్థాయిలోనే మొదలైంది. 13 ఏళ్ల 187 రోజుల వయసులో అండర్-19 టెస్టులో శతకం సాధించి.. ఈ ఫార్మాట్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఆ తర్వాత అండర్-19 వన్డేల్లోనూ తన జోరు కొనసాగించాడు. 14 ఏళ్ల 100 రోజుల వయసులోనే శతకం బాది మరో అరుదైన ఘనత అందుకున్నాడు.
ఐపీఎల్లో గేల్ రికార్డుకు చెక్..: వైభవ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగడానికి ఐపీఎల్ కీలకంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే ఐపీఎల్ శతకం సాధించాడు. అంతేకాదు.. ఒక సీజన్లో ఏకంగా 72 సిక్సర్లు బాది క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును అధిగమించాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సంచలనం..: దేశవాళీ టీ20ల్లోనూ వైభవ్ తన దూకుడును తగ్గించలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 14 ఏళ్ల 250 రోజుల వయసులో శతకం సాధించి.. ఈ టోర్నీలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
టీ20 అంతర్జాతీయ అరంగేట్రంతో మరో రికార్డు..: అద్భుత ప్రదర్శనలతో త్వరగానే భారత సీనియర్ జట్టులోకి వచ్చిన వైభవ్.. 15 ఏళ్ల 99 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అనంతరం టీ20ల్లో 15 ఏళ్ల 118 రోజుల వయసులో అర్ధశతకం సాధించి.. టీ20 అంతర్జాతీయాల్లో అత్యంత చిన్న వయసులో ఫిఫ్టీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత కేవలం మూడు రోజులకే మరో ఘనత అతడి ఖాతాలో చేరింది. 15 ఏళ్ల 121 రోజుల వయసులో భారత పురుషుల క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు.
దులీప్ ట్రోఫీలో 57 ఏళ్ల రికార్డు బద్దలు..: వైట్‌బాల్ క్రికెట్లోనే కాదు.. ఎర్ర బంతి ఆటలోనూ తన సత్తా చాటగలనని వైభవ్ నిరూపించాడు. దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్ తరఫున ఆడిన అతడు.. సెంట్రల్ జోన్‌తో సెమీఫైనల్లో కేవలం 81 బంతుల్లో 92 పరుగులు చేశాడు. శతకానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయినా.. ఆ ఇన్నింగ్స్ అతడికి చారిత్రక గుర్తింపును తెచ్చింది. 15 ఏళ్ల 157 రోజుల వయసులో దులీప్ ట్రోఫీలో అర్ధశతకం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. తద్వారా 57 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు.
2026లో పరుగుల వరద..: ఈ ఏడాది వైభవ్ బ్యాట్ ఆగడం లేదు. అండర్-19, ఇండియా-ఎ, భారత సీనియర్ జట్టు, రాజస్థాన్ రాయల్స్, ఈస్ట్ జోన్ తరఫున అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. 2026లో ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 41 మ్యాచ్‌ల్లో 41 ఇన్నింగ్స్‌లు ఆడి 2,022 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో 3 శతకాలు, 14 అర్ధశతకాలు ఉన్నాయి.
సిక్సర్లలోనూ నంబర్ వన్..: వైభవ్ బ్యాటింగ్‌లో ప్రధాన ఆకర్షణ అతడి సిక్సర్లే. 2026లో ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 179 ఫోర్లు, 161 సిక్సర్లు బాదాడు. ఈ ఏడాది ప్రపంచ క్రికెట్లో అన్ని ఫార్మాట్లను కలిపి అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ వైభవ్ నిలిచాడు. చిన్న వయసులోనే ఇన్ని రికార్డులు సొంతం చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. భవిష్యత్తులో మరెన్ని ప్రపంచ రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి. అతడి దూకుడు ఇలాగే కొనసాగితే భారత క్రికెట్లో ఓ సుదీర్ఘ అధ్యాయాన్ని లిఖించే అవకాశం ఉంది.







