Headlines

కారులో AC ఆన్ చేసి నిద్రపోయాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మారిన హోటల్ మేనేజర్! | Tamil Nadu: Restaurant manager dies after sleeping in car with AC in Ranipet District


రాణిపేట: ఏసీ వేసుకుని కారులో నిద్రపోయిన ఓ ప్రైవేట్ హోటల్ మేనేజర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లా వాలాజాపేటలో విషాదం నింపింది. కారులో ఎక్కువసేపు నిద్రించిన సమయంలో ఊపిరాడక మురళి (42) మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాలాజాపేటకు చెందిన మురళి గత 15 ఏళ్లుగా తన కుటుంబంతో కలిసి చెన్నైలో నివసిస్తున్నాడు. అక్కడ ఓ ప్రైవేట్ రెస్టారెంట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వాలాజాపేటలో నివసిస్తున్న తన తండ్రిని చూసేందుకు మురళి చెన్నై నుంచి కారులో వచ్చాడు. తండ్రితో కలిసి భోజనం చేసిన అనంతరం కారును ఇంటి సమీపంలో పార్క్ చేశాడు.

అనంతరం కారులో ఏసీ ఆన్ చేసి మురళి నిద్రపోయాడు. అయితే చాలా సమయం గడిచినా మురళి కారు నుంచి బయటకు రాకపోవడంతో అతని తండ్రికి అనుమానం వచ్చింది. వెంటనే కారు తలుపు తెరిచి చూడగా మురళి అపస్మారక స్థితిలో కనిపించాడు. శ్వాస తీసుకోకుండా, మాట్లాడకుండా ఉండటంతో కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో అతన్ని వెంటనే అంబులెన్స్‌లో వాలాజాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే అక్కడి వైద్యులు పరీక్షించి మురళి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న మురళి భార్య ప్రియ వాలాజాపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కారును పార్క్ చేసి ఏసీ ఆన్ చేసి నిద్రించిన సమయంలో వాహనం నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువు కారులోకి చేరి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దాని ప్రభావంతో మురళికి ఊపిరాడక మృతి సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణం స్పష్టమవుతుందని పోలీసులు చెబుతున్నారు.

మురళి మృతికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రిని చూసేందుకు చెన్నై నుంచి వాలాజాపేటకు వచ్చిన మురళి ఇలా అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *