Headlines

Video: చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకున్న విద్యార్థులు! | Medak School Children Perform Traditional Frog Ritual, Pray to Rain God for Timely Monsoon

Video: చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకున్న విద్యార్థులు! | Medak School Children Perform Traditional Frog Ritual, Pray to Rain God for Timely Monsoon


భానుడి భగభగలకు భూమాత అల్లాడిపోతోంది. వర్షాలు లేక అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు పండాలని కోరుకుంటూ మెదక్ జిల్లాలో పాఠశాల విద్యార్థులు చేసిన వినూత్న ప్రార్థన అందరినీ ఆకట్టుకుంది. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకుంటూ చిన్నారులు చేసిన నృత్యం గ్రామస్తులను కదిలించింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల వేదికగా ఒక అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షాలు సమృద్ధిగా కురిసి, లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ విద్యార్థులు వరుణ దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచందర్రావు ఆధ్వర్యంలో చిన్నారులంతా ఏకమయ్యారు. గ్రామంలోని స్థానిక చెరువు నుంచి పవిత్ర జలాలను సేకరించారు. పురాతన సంప్రదాయం ప్రకారం కావలికి కప్పను, వేపాకులను, వేప రెమ్మలను కట్టి ప్రత్యేకంగా అలంకరించారు. ఆ కప్ప కావడిపై చెరువు నీటితో భక్తిశ్రద్ధలతో అభిషేకం చేస్తూ వాన దేవుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. చెరువు దగ్గర పూజలు ముగించుకున్న విద్యార్థులు.. నేరుగా వ్యవసాయ క్షేత్రాల్లోకి అడుగుపెట్టారు.

చినుకమ్మ ఓ చినుకమ్మ.. ఒక్కసారి వచ్చి నేల తడిసిపోవమ్మా అంటూ సాగిన పాటకు చిన్నారులు అద్భుతమైన నృత్య ప్రదర్శన చేశారు. నిరీక్షిస్తున్న అన్నదాతల ఆవేదనను, వర్షం కోసం ఎదురుచూస్తున్న భూమాత తపనను తమ నృత్యం ద్వారా కళ్లకు కట్టారు. లోకకల్యాణం కోసం, రైతాంగం బాగుండాలంటూ పసి హృదయాలతో చిన్నారులు చేసిన ఈ ప్రార్థన చూసి గ్రామస్తులు ముగ్ధులయ్యారు. సాంప్రదాయాలను గుర్తుచేస్తూ.. సమాజ హితం కోరి విద్యార్థులు చేసిన ఈ ప్రయత్నాన్ని, వారికి మార్గదర్శిగా నిలిచిన హెచ్ఎం రామచందర్రావును గ్రామ పెద్దలు, ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు. పసిపిల్లల పిలుపునైనా ఆలకించి వరుణుడు కరుణిస్తాడేమోనని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారుల ఆటాపాట వీడియో చూడండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *