Headlines

Vishwanath and Sons: సూర్యకి నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను: త్రివిక్రమ్ శ్రీనివాస్ | Trivikram srinivas interesting comments at vishwanath and sons


స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే కరువు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న సూర్య. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో సూర్యతో పాటు మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్ట్ గా హాజరయ్యారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈ కథ విన్నప్పటి నుంచే, ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి సమయంలో ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని విజయవంతం చేసినందుకు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను(నవ్వుతూ). త్వరలోనే మేమిద్దరం కలిసి పని చేస్తామని నమ్ముతున్నాను. నా సతీమణి సూర్య గారికి పెద్ద ఫ్యాన్. సూర్య గారితో సినిమా చేయమని రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్ లకు పెద్దగా వెళ్ళరు. అలాంటిది సూర్య గారి మీద అభిమానంతో ఈ సినిమా సెట్ కి వెళ్ళి, సూర్య గారితో ఫోటో దిగారు. ఆడవాళ్లు అంత గమ్మున ఇష్టపడరు. కానీ, ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతికొద్ది మంది ఉంటారు. అందులో సూర్య గారు ఒకరు. ఇండియాలో ఇద్దరే హీరోలకు వయసు వెనక్కి వెళ్తుంది. ఒకళ్ళు సూర్య గారు, ఇంకొకళ్ళు మహేష్ బాబు గారు. గజినీలో సూర్య గారు పోషించిన సంజయ్ రామస్వామి పాత్ర.. తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైన పాత్ర. కొన్ని పాత్రలు మనతో పాటు దశాబ్దాల పాటు ప్రయాణిస్తాయి. అలాంటి పాత్ర అది. హిందీ గజినీ చేసిన సమయంలో ‘నేను సూర్యను మ్యాచ్ చేయలేకపోయాను’ అని స్వయంగా అమీర్ ఖాన్ గారు ఒప్పుకున్నారు. జల్సా సినిమా చేసేటప్పుడు ఈ విషయం నాకు అల్లు అరవింద్ గారు చెప్పారు. ఆ లుక్ ని మళ్ళీ తీసుకురావడం కోసం వెంకీ పడిన కష్టానికి, అది రాయడంలో గానీ, తీయడంలో గానీ హ్యాట్సాఫ్. వెంకీ చాలా బాగా రాశారు. ఎడిట్ లో చూసిన సమయంలోనే నాకు అనిపించింది.. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు భవిష్యత్తులో ఐకానిక్ సీన్స్ గా మిగిలిపోతాయి అని అన్నారు.

అలాగే  ఈ సినిమాలో నాలుగు పిల్లర్స్ ఉన్నాయి. ఒక పిల్లర్ సూర్య గారైతే, ఇంకో పిల్లర్ రాధిక గారు, మూడో పిల్లర్ రవీనా టాండన్ గారు, ఇంకో పిల్లర్ మమితా బైజు గారు. నేను కేజీఎఫ్ చూశాను, అలాగే బయట కూడా నాకు రవీనా గారు తెలుసు. బయట స్ట్రాంగ్ గా, డైనమిక్ లేడీలా కనిపిస్తారు. కానీ, ఇందులో ఆశ్చర్యకర పాత్ర పోషించారు. చాలా సహజంగా నటించారు. చూసే వారికి అది తేలికగా అనిపించవచ్చు కానీ, ఆ పాత్ర పోషించడం ఎంత కష్టమో నాకు తెలుసు. మమితా పాత్రకు తగ్గట్టుగా ఎంతో ఎనర్జిటిక్ గా చేశారు. ఇక సూర్య గారిది చాలా డిఫికల్ట్ క్యారెక్టర్. కొంచెం కూడా ఎక్కువ చేయకూడదు. అలా అండర్ పెర్ఫార్మ్ చేయడం చాలా కష్టం. అలాంటి పాత్రలో సూర్య గారు అద్భుతంగా నటించారు. సూర్య గారి సినిమా నిర్మాణంలో మా ప్రొడక్షన్ పేరు కూడా ఉన్నందుకు సంతోషంగా ఉంది. కానీ, సూర్య గారి సినిమాకి దర్శకుడిగా నా పేరు పడినప్పుడు ఇంకా ఎక్కువ సంతోషిస్తాను. ఒక్క ఏడాది వ్యవధిలో కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ లాంటి రెండు పూర్తి విభిన్న సినిమాలు చేశారు. సూర్య గారు ప్రయాణం మళ్ళీ కొత్తగా మొదలుపెట్టినట్లు అనిపిస్తుంది. మనతో ప్రయాణిస్తున్నారు, మనకు ఎన్నో ఙ్ఞాపకాలు ఇస్తున్నారు. సూర్య గారి నుంచి నేర్చుకోవాల్సింది వినయం. సూర్య తండ్రి గారు (శివకుమార్) అంటే నాకెంతో గౌరవం. సూర్య గారు, కార్తీ గారిని తెలుగు హీరోలుగా భావిస్తాం. ఇప్పుడు తమిళ సినిమా, తెలుగు సినిమా, హిందీ సినిమా అనే హద్దులు లేవు. ఇప్పుడు అన్ని భాషలు కలిపి ఇండియన్ సినిమా అయింది. ప్రపంచ వేదికపై భారతీయ సినిమా సత్తా చాటాల్సిన సమయం ఇది. ఆ దిశగానే మేమందరం పని చేస్తున్నాం. ఈ సినిమాకి నిజమైన హీరోలు ప్రేక్షకులే అని త్రివిక్రమ్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *