హైదరాబాద్, జులై 24: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది. పేదరకంలో పుట్టి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఉదయ్ కృష్ణారెడ్డికి మద్ధతుగా పలువురు గళం విప్పుతున్నారు. తాజాగా ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో మాజీ ఐపీఎస్ ఎం నాగేశ్వరరావు సంచలన ట్వీట్ చేశారు. లేడీ ట్రైనీ తన వ్యక్తిగత స్వార్థం కోసం ఉదయ్ కృష్ణారెడ్డిని బలిపశువును చేసిందని ఆయన ఆరోపణలు చేశారు. తనకు అలాట్ చేసిన మణిపూర్ క్యాడర్ నుంచి మార్పు కోసమే సదరు మహిళా అధికారి తమిళనాడు కేడర్ కి చెందిన మరో అధికారిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.
వివాహం తర్వాత కూడా ఉదయ్‌తో సంబంధం కొనసాగించింది. ఆ విషయం భర్తకు తెలియడంతోనే ఉదయ్ కృష్ణారెడ్డిపై వేధింపుల ఫిర్యాదు చేసి విమర్శల పాలు చేసింది. తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనింగ్‌ను నిలిపివేయడం ముందస్తు శిక్షేనని మాజీ ఐపీఎస్ ఎం నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎన్‌పీఏ (NPA) డైరెక్టర్ వెంటనే ఉదయ్ కృష్ణారెడ్డి శిక్షణను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ ఆయన డిమాండ్ చేశారు. విచారణ పూర్తికాకముందే ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న ట్రైనీ ఐపీఎస్ భవిష్యత్తును దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేశారు. శిక్షణ నిలిపివేయడం.. నేరం రుజువు కాకముందే శిక్షించినట్టు అవుతుందని తన ట్వీట్‌లో సూచించారు.
మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్‌ను విచారించిన కోర్టు కేసుకు సంబంధించిన వివరాలు సమర్పించాలంటూ పోలీసులను ఆదేశించింది. పిటిషనర్ ట్రైనీ ఐపీఎస్ గా ఉన్నారని, అప్పటి వరకు తదుపరి చర్యలు చేపట్టకుండా పోలీసులను ఆదేశించాలంటూ ఉదయ్ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది కోరగా హైకోర్టు అందుకు అంగీకరించలేదు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని కేసును కొట్టివేయాలని ఉదయ్ కృష్ణారెడ్డి పిటీషన్‌లో పేర్కొన్నారు. కాగా జూన్ 23 నుంచి తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిణి లైంగిక వేధింపులు, వ్యక్తిగత వీడియోలను భర్తకు పంపించి ఇబ్బందులకు గురి చేశాడని ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు ప్రస్తుతం విచారణ జరుపుతుంది.