Headlines

ఇది ఇండియన్ టీమా లేక హాస్పిటల్ వార్డా..? ఆ దెబ్బకు రంగంలోకి బిగ్ బాస్..! | Indian cricket injury crisis bcci secretary devajit saikia vvs laxman coe meeting

ఇది ఇండియన్ టీమా లేక హాస్పిటల్ వార్డా..? ఆ దెబ్బకు రంగంలోకి బిగ్ బాస్..! | Indian cricket injury crisis bcci secretary devajit saikia vvs laxman coe meeting


Indian Cricket Team Injuries: టీమిండియా క్రీడాకారుల గాయాల సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఏకంగా ఒక ప్రధాన జట్టునే ఏర్పాటు చేసేంత మంది కీలక ఆటగాళ్లు గాయపడటంతో బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ)కు చేరుకుని వివిఎస్ లక్ష్మణ్‌తో అత్యవసరంగా భేటీ కావడం తీవ్ర కలకలం రేపుతోంది.

భారత జట్టును వరుస గాయాలు వెంటాడుతున్న తీరుపై బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్న ఆటగాళ్ల పునరావాస పురోగతిని సమీక్షించడానికి బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా, సిఓఈ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వర్చువల్‌గా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు సంపూర్ణ ఫిట్‌నెస్ సాధించకముందే వారిని మైదానంలోకి దించడంపై సెలెక్షన్ కమిటీకి, స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తడమే ఈ అత్యవసర సమావేశానికి దారితీసింది.

ఎక్కువమంది చదివినది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?

స్టార్ బౌలర్ల నుంచి ఆల్‌రౌండర్ల వరకు..

ప్రస్తుతం బెంగళూరులోని సిఓఈ రిహాబ్ సెంటర్‌లో నలుగుతున్న ఆటగాళ్ల జాబితా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తుంటి గాయం వల్ల ఆకాష్ దీప్ గత రంజీ ట్రోఫీ సెమీఫైనల్ నుంచి సుదీర్ఘకాలంగా దూరంగా ఉండగా, బుమ్రా మోకాలి వాపు, నీరు చేరిన సమస్యతో సతమతమవుతున్నారు. యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ బొటనవేలి నొప్పితో ఇబ్బంది పడుతుంటే, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి హామ్‌స్ట్రింగ్ గాయాలతో పోరాడుతున్నారు. వీరికి తోడు వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నారు. విదేశీ, పరిమిత ఓవర్ల స్పెషలిస్టులు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్ కూడా అదే ఆసుపత్రి వాతావరణంలో రిహాబిలిటేషన్‌లో ఉన్నారు.

ఫిట్‌నెస్ నిర్వహణపై హెడ్ ఆఫీస్ అసంతృప్తి..

నారాయణ్ నితిన్ పటేల్ 2025 ప్రారంభంలో వైదొలిగినప్పటి నుంచి స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి హెడ్ లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఫిట్‌నెస్ విషయంలో ఆటగాళ్లు సరైన ప్రమాణాలు పాటించడం లేదని బిసిసిఐ భావిస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన వేళ హర్షిత్ రాణా తీవ్రమైన ఓవర్ వెయిట్‌తో కనిపించడంపై సెలెక్షన్ కమిటీ అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి తన బౌలింగ్ వేగాన్ని గంటకు 7 నుంచి 8 కిలోమీటర్లు పెంచే ప్రయత్నంలో కండరాల ఒత్తిడికి గురై గాయపడ్డారు.

అస్పష్టమైన సమాచారంతో సెలెక్టర్ల గందరగోళం..

బుమ్రా, సాయి సుదర్శన్ కనీసం ఒక టెస్టుకైనా అందుబాటులోకి వస్తారని సెలెక్షన్ కమిటీకి మొదట సమాచారం ఇచ్చారు. తీరా అసలు పరిస్థితిని సమీక్షిస్తే బుమ్రా మోకాలికి మరింత విశ్రాంతి అవసరమని తేలింది. సాయి సుదర్శన్ రోజుకు 75 నిమిషాలు బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ బొటనవేలి నొప్పి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. క్రీడాకారులను తొందరపడి మైదానంలోకి దించకుండా, భవిష్యత్తు సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని వైద్య బృందం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *