
నాన్‌వెజ్ ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్, మటన్ ఎలాగూ క్రేజీ ఆప్షన్లే.. కానీ చాలామంది ప్లేట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది మాత్రం లివర్ ఫ్రై లేదా లివర్ కాలేయ మసాలా. వంటకాల్లో ప్రత్యేకమైన రుచిని అందించడమే కాదు ఆరోగ్యపరంగానూ లివర్ ఒక పవర్‌హౌస్. అయితే మాంసం షాప్‌కి వెళ్లగానే చాలామందికి వచ్చే బిగ్గెస్ట్ డౌట్..మటన్ లివర్ తీసుకెళ్లాలా? లేక చికెన్ లివర్ తీసుకోవాలా? అని.. చికెన్ లివర్‌తో పోలిస్తే మటన్ లివర్ ధర కాస్త ఎక్కువే. మరి ధర ఎక్కువ ఉన్నంత మాత్రాన మటన్ లివరే గొప్పదా? లేక తక్కువ ధరలో దొరికే చికెన్ లివర్ ఏమైనా తక్కువా? ఈ రెండింటి పోషకాల రేసులో అసలైన విజేత ఎవరో, మీ బాడీ అవసరాలకు ఏది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ప్రొటీన్ – కేలరీల వార్: ఫిట్నెస్ ఫ్రీక్స్ చాయిస్ ఏది?
జిమ్‌కి వెళ్లేవారైనా, బరువు తగ్గాలనుకునే వారైనా డైట్లో ప్రొటీన్కే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయంలో రెండూ గట్టి పోటీనే ఇస్తాయి, కానీ చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి.
మటన్ లివర్ (100 గ్రాముల్లో): సుమారు 26 గ్రాముల హై క్వాలిటీ ప్రొటీన్ లభిస్తుంది. కాకపోతే ఇందులో కేలరీలు కొంచెం ఎక్కువ.. అంటే 135 కేలరీలు ఉంటాయి.
చికెన్ లివర్ (100 గ్రాముల్లో): సుమారు 24 గ్రాముల ప్రొటీన్ దక్కుతుంది. కేలరీలు మాత్రం కేవలం 115 మాత్రమే. కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది.
మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉంటూ, క్యాలరీ కట్ చేయాలనుకుంటే చికెన్ లివర్ బెస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. అదే మీకు హెవీ ప్రొటీన్ బూస్ట్, మజిల్ గెయిన్ కావాలంటే మటన్ లివర్ ఎంచుకోవచ్చు.
ఐరన్ – విటమిన్స్
రోజంతా అలసటగా ఉందా? రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండి నీరసిస్తున్నారా? అయితే లివర్ తినడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ లభిస్తుంది. రెండు కాలేయాల్లోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అయితే చికెన్ లివర్‌తో పోలిస్తే మటన్ లివర్‌లో ఐరన్ శాతం కొద్దిగా ఎక్కువ. అనీమియా సమస్యతో బాధపడేవారు లేదా రక్తం త్వరగా పట్టాలనుకునే వారికి మటన్ లివర్ ఒక ఔషధంలా పనిచేస్తుంది.
విటమిన్ ఎ: కంటి చూపు మెరుగుపడటానికి, రోగనిరోధక శక్తి, పెరగడానికి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి విటమిన్ ఎ చాలా అవసరం. ఇందులోనూ మటన్ లివర్‌దే పైచేయి.
విటమిన్ బి12 : నరాల బలహీనత తగ్గడానికి, ఎర్ర రక్త కణాల తయారీకి బి12 చాలా కీలకం. 100 గ్రాముల లివర్‌లో మన రోజువారీ అవసరానికి మించిన బి12 లభిస్తుంది.
పాకెట్ ఫ్రెండ్లీ – కుకింగ్ టైమ్
మార్కెట్లో చికెన్ లివర్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. విద్యార్థులు, బ్యాచిలర్స్ లేదా తక్కువ బడ్జెట్లో పోషకాహారం కోరుకునే వారికి చికెన్ లివర్ సరసమైన ఎంపిక. చికెన్ లివర్ చాలా త్వరగా, సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. కానీ మటన్ లివర్‌ను పర్ఫెక్ట్గా వండటానికి కాస్త ఎక్కువ సమయం, నైపుణ్యం పడుతుంది. సరిగ్గా వండకపోతే మటన్ లివర్ గట్టిగా మారే అవకాశం ఉంది.
ఎంత తింటున్నాం అనేదే ముఖ్యం..
ఏదైనా అతిగా తింటే అమృతమైనా విషమే అనే సామెత లివర్‌కి వంద శాతం వర్తిస్తుంది. లివర్‌లో విటమిన్ ఎ, కొలెస్ట్రాల్ శాతం చాలా ఎక్కువగా ఉంటాయి. వారానికి ఒకసారి లేదా నెలకు 1-2 సార్లు మాత్రమే తినడం సురక్షితం. ప్రతిరోజూ తింటే శరీరంలో విటమిన్ ఎ విషతుల్యమయ్యే ప్రమాదం ఉంది.
వీళ్లు లివర్‌కు దూరంగా ఉండాలి..
గర్భిణీ స్త్రీలు: ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు కాలేయం తినడాన్ని పూర్తిగా నివారించాలి. ఇందులో ఉండే అతి అధిక విటమిన్ ఎ కడుపులోని బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
గౌట్ రోగులు: లివర్‌లో ప్యూరిన్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి కీళ్ల నొప్పులు తీవ్రమవుతాయి.
హై కొలెస్ట్రాల్ – గుండె సమస్యలు ఉన్నవారు: కాలేయంలో కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే కొలెస్ట్రాల్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకే పరిమితంగా తీసుకోవాలి.