హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది. వర్షాలు తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయానికి విద్యుత్ మోటార్ల వినియోగం అధికం కావడంతో కరెంట్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఆగస్టు 12న రాష్ట్రంలో గరిష్ఠంగా 15,835 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది ఇదే తేదీన రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 10,787 మెగావాట్లుగా ఉండగా.. ఈసారి ఏకంగా 5,048 మెగావాట్లు అధికంగా నమోదైంది. సాధారణంగా వేసవిలో కనిపించే స్థాయి డిమాండ్ ఆగస్టులోనే నమోదవుతుండటం విద్యుత్ శాఖకు సవాల్‌గా మారింది.
వర్షాభావంతో పెరిగిన వ్యవసాయ విద్యుత్ వినియోగం
రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సాగునీటి కోసం రైతులు బోర్లు, బావులపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా వరి సాగు చేస్తున్న రైతులు పంటను కాపాడుకునేందుకు విద్యుత్ మోటార్లను ఎక్కువసేపు నడుపుతున్నారు. దీంతో వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం అంచనాలను మించి పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు వర్షాభావ పరిస్థితులతో పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, ఉక్కపోత అధికం కావడంతో ఇళ్లలో కూలర్లు, ఏసీల వినియోగం కూడా పెరిగింది.
ఆగస్టులో భారీగా పెరిగిన వినియోగం
ఆగస్టు 12న రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం 283.26 మిలియన్ యూనిట్లకు చేరింది. గత ఏడాది ఇదే రోజున ఇది 208.07 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. అంటే ఏడాది వ్యవధిలో వినియోగం గణనీయంగా పెరిగింది. దక్షిణ డిస్కమ్ పరిధిలోనే 3,623 మెగావాట్ల మేర అదనపు డిమాండ్ నమోదైంది. ఉత్తర డిస్కమ్ పరిధిలోనూ 1,421 మెగావాట్ల పెరుగుదల కనిపించింది.
కోర్ అర్బన్ ఏరియాలోనూ పెరిగిన లోడ్
కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఆగస్టు 12న గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 3,920 మెగావాట్లకు చేరింది. గత ఏడాది ఇదే రోజు 3,310 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఈ ప్రాంతంలో విద్యుత్ వినియోగం కూడా గతేడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఏసీలు, కూలర్లు, వాణిజ్య సంస్థలు, ఐటీ రంగం నుంచి పెరుగుతున్న డిమాండ్ ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా అధికారులు పేర్కొంటున్నారు.
నార్తర్న్ డిస్కమ్‌లో పాత రికార్డు బద్దలు
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ డిస్కమ్ పరిధిలోనూ విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది ఆగస్టు 26న నమోదైన 5,655 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ను ఈసారి ఆగస్టు 3నే అధిగమించింది.
ఆ రోజు నార్తర్న్ డిస్కమ్ పరిధిలో 6,198 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైనట్లు డిస్కమ్ సీఎండీ వరుణ్ రెడ్డి వెల్లడించారు.
డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు
విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో డిస్కమ్‌లు అప్రమత్తమయ్యాయి. అదనపు లోడ్‌ను తట్టుకునేలా సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లను బలోపేతం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేక బృందాలను 24 గంటలు అందుబాటులో ఉంచుతున్నారు. కీలక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని డిస్కమ్‌ల సీఎండీలు తెలిపారు.