వ్యాపారం ప్రారంభించాలనుకునేవారితో పాటు స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయోజనాలు అందిస్తోంది. సబ్సిడీలతో పాటు రుణ సౌకర్యాలు కల్పిస్తోంది. తక్కువ వడ్డీకి రుణ సదుపాయం అందిస్తోంది. వీధి వ్యాపారుల కోసం కేంద్రం పీఎం స్వనిధి యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి హామీ పెట్టకుండానే రూ.90 వేల వరకు రుణం పొందవచ్చు. ఈ మేరకు ప్రత్యేక క్రెడిట్ కార్డును అందిస్తోంది. దీని ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు అవసరమైనప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు. జూన్ 2020లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా.. కరోనా సమయంలో వ్యాపారాన్ని కోల్పోయిన వీధి వ్యాపారులకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. మార్చి 2030 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది.
75.5 లక్షల మందికి లబ్ది
ఇప్పటివరకు ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 75.5 లక్షల మంది లబ్ది పొందారు. వీరికి రూ.17,800 కోట్లకుపైగా విలువైన రూ.1.12 కోట్లకుపైగా లోన్లు అందించారు. ఇందులో 55 లక్షల మంది లబ్దిదారులకు డిజిటల్‌గా అందించారు. సకాలంలో వడ్డీ చెల్లించినవారికి వడ్డీ రాయితీతో పాటు క్యాష్ బ్యాక్ అందిస్తున్నారు. ఈ రూపంలో రూ.800 కోట్లు లబ్దిదారులు అందుకున్నారు. గతంలో పీఎం స్వనిధి యోజన పథకం రుణ పరిమితి రూ.80 వేలుగా ఉండగా.. ఆ తర్వాత కేంద్రం మరో రూ.10 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.90 వేల వరకు చిన్న వ్యాపారులు రుణం తీసుకోవచ్చు. ముందుగా రుణ అర్హతను పరిశీలించి ఆ తర్వాత మంజూరు చేస్తారు. మూడు దశల్లో రుణ మొత్తాన్ని విడతల వారీగా తీసుకోవచ్చు. తొలుత రూ.15 వేలు, ఆ తర్వాత రూ.25 వేలు అందించనుండగా.. మూడో విడతతో రూ.50 వేలు అకౌంట్లో జమ చేస్తారు.
రూ.30 వేల లిమిట్‌తో క్రెడిట్ కార్డు
అలాగే లబ్దిదారులకు యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు అందిస్తారు. రుణానికి సంబంధించి రెండు వాయిదాలను సకాలంలో చెల్లించినవారికి రూ.30 వేల లిమిట్‌తో కూడిన క్రెడిట్ కార్డు అందిస్తారు. దీనిని యూపీఐతో లింక్ చేసి ఉపయోగించుకోవచ్చు. ఇక రిటైల్, హోల్ సేల్ లావాదేవీలకు కోసం చేసే డిజిటల్ చెల్లింపులపై క్యాష్ బ్యాక్ కూడా అందిస్తారు. అయితే ఆలోన్ పొందేందుకు ఎలాంటి పత్రాలు అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డుతో పాటు మీ బ్యాంక్ వివరాలను సమర్పిస్తే సరిపోతుంది. తీసుకున్న రుణాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మీ సమీపంలోని ఏదైనా బ్యాంకుకు వెళ్లి ఈ రుణాన్ని పొందవచ్చు. మీ అర్హతను పరిశీలించి వెంటనే రుణం మంజూరు చేస్తారు.