Headlines

మెటర్నిటీ లీవ్ పూర్తయి మొన్నే ఉద్యోగంలోకి .. అంతలోనే దారుణం! | Victim stabbed to death in Times Square rampage was VP at Bank of America, just celebrated 2nd wedding anniversary


అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన ఘోర కత్తిపోట్ల ఘటన ఒక అమాయక ప్రాణాన్ని బలిగొంది. ఆగస్టు 31, 2026 సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ అకస్మాత్తు దాడిలో ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా’ (BofA) వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ఎరిన్ పియాసెంటి అనే మహిళా అధికారిణి మరణించారు. ఆమె ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిసింది

ఐవీ లీగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె, ప్రఖ్యాత ఫోర్ధమ్ లా స్కూల్ నుంచి న్యాయ విద్యను పూర్తి చేశారు. ఇటీవల ప్రసూతి సెలవు ముగించుకుని తిరిగి విధుల్లోకి చేరిన ఆమె అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దారుణ ఘటనపై బ్యాంక్ ఆఫ్ అమెరికా యాజమాన్యం,  ఫోర్ధమ్ లా స్కూల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని ప్రకటించాయి.

న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సబ్‌స్టేషన్ సమీపంలో ఈ దాడి జరిగింది. 49 ఏళ్ల మహిళ షాపింగ్ బ్యాగ్ నుంచి హఠాత్తుగా రెండు కత్తులు బయటకు తీసి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఎరిన్ పియాసెంటి ప్రాణాలు కోల్పోగా, 68 ఏళ్ల వృద్ధుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి పాల్పడిన మహిళను క్వీన్స్‌కు చెందిన పామెలా సిస్నెరోస్ గా పోలీసులు గుర్తించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమె, తన షాపింగ్ బ్యాగ్ నుంచి రెండు పెద్ద కత్తులు తీసి ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి చేసింది.

ఘటనా స్థలానికి చేరుకున్న న్యూయార్క్ పోలీసులపై ఆమె కత్తులతో దాడి చేసే ప్రయత్నం చేసింది.  కత్తులు పడేయాలని వారు హెచ్చరించారు. ఆమె వినకుండా పోలీసుల పైకి దూసుకురావడంతో, వారు జరిపిన కాల్పుల్లో సదరు నిందితురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  మరోవైపు ఈ ఘటనపై  న్యూయార్క్‌ మేయర్‌ జొహ్రాన్‌ మమ్దానీ విచారం ప్రకటించారు. బాధిత కుటుంబాలు వేదనను అర్థం చేసుకోగలమని, వారికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. పర్యాటకులు, స్థానికులతో ఎప్పుడూ రద్దీగా ఉండే టైమ్స్ స్క్వేర్ నడిబొడ్డున  హింసాత్మక ఘటన జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది .



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *