Headlines

లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే హక్కు ఎవరికి ఉంటుంది..! | Lawyer vs Advocate: Who Can Argue in Court, Key Differences Explained


సాధారణంగా ప్రజలు కోర్టు వ్యవహారాలు, చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు లాయర్, అడ్వకేట్ అనే రెండు పదాలను ఒకే అర్థంతో వాడుతుంటారు. నల్లకోటు వేసుకున్న ప్రతి ఒక్కరినీ లాయర్ లేదా అడ్వకేట్ అని పిలవడం సహజంగా చూస్తుంటాం. అయితే న్యాయశాస్త్రం ప్రకారం వీరిద్దరి హోదా, విధులు, అధికారాల మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంది. ఇద్దరూ న్యాయశాస్త్రం చదివిన వారే అయినప్పటికీ.. ఒకరు కోర్టులో నేరుగా నిలబడి వాదించగలరు, మరొకరు కేవలం చట్టపరమైన సలహాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి డిగ్రీ పొందిన ప్రతి ఒక్కరినీ లాయర్ అని పిలుస్తారు. లాయర్ చట్టపరమైన నిబంధనలపై అవగాహన కలిగి ఉండి, లీగల్ నోటీసులు పంపడం, ఒప్పంద పత్రాలు సిద్ధం చేయడం, కంపెనీలకు లేదా వ్యక్తులకు న్యాయ సలహాలు ఇవ్వడం వంటి పనులు చేయగలరు. అయితే బార్ కౌన్సిల్ అనుమతి లేకుండా కేవలం ఎల్ఎల్బీ డిగ్రీ మాత్రమే కలిగిన వ్యక్తి నేరుగా న్యాయస్థానంలో నిలబడి క్లయింట్ తరఫున వాదనలు వినిపించడానికి చట్టం అంగీకరించదు.

అడ్వకేట్ అంటే..?

ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి అధికారికంగా లైసెన్స్ పొందిన లాయర్‌ను అడ్వకేట్ అంటారు. దీనికోసం అభ్యర్థి మొదట స్టేట్ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుని.. ఆపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. బార్ కౌన్సిల్ నుంచి ప్రాక్టీస్ లైసెన్స్ పొందిన తర్వాతే ఆ వ్యక్తికి కోర్టులో క్లయింట్ తరఫున కేసును వాదించే పూర్తి హక్కు లభిస్తుంది. అందుకే న్యాయరంగంలో ప్రతి అడ్వకేట్ ఒక లాయరే.. కానీ ప్రతి లాయర్ అడ్వకేట్ కాలేరు అనే నానుడి ఉంది.

ఇక న్యాయశాస్త్రం అభ్యసించడానికి మన దేశంలో రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రవేశ పరీక్షల ద్వారా నేరుగా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల్లో చేరవచ్చు. ఇప్పటికే ఏదైనా సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారు 3 సంవత్సరాల ఎల్ఎల్బీ కోర్సును ఎంచుకోవచ్చు. చదువు పూర్తయిన తర్వాత కార్పొరేట్ కంపెనీల్లో లీగల్ అడ్వైజర్లుగా స్థిరపడాలనుకునేవారు లాయర్లుగా సేవలు అందించవచ్చు. అయితే కోర్టు బోను ఎదుట నిలబడి న్యాయపోరాటం చేయాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా బార్ కౌన్సిల్ పరీక్ష రాసి అడ్వకేట్‌గా మారాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *