Headlines

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక పాము కాటేసిన భయం వద్దు.. చిటికెలో చికిత్స.. ఎలా అంటే? | AP Govt Launches Anti Snake Venom Service in 108 Ambulances

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక పాము కాటేసిన భయం వద్దు.. చిటికెలో చికిత్స.. ఎలా అంటే? | AP Govt Launches Anti Snake Venom Service in 108 Ambulances


పాముకాటు వల్ల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాముకాటు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనే విషప్రభావం తీవ్రం కాకుండా అవసరమైన చర్యలు తీసుకునేలా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే అంబులెన్స్‌లో ASV ఉందని EMT ఇష్టానుసారం ఇవ్వరు. బాధితుడిలో విషప్రభావ లక్షణాలు కనిపిస్తే ముందుగా మంగళగిరి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ERC) వైద్యుడిని సంప్రదిస్తారు. అంబులెన్స్‌లోని డోమ్ కెమెరా ద్వారా వైద్యుడు బాధితుడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ASV అవసరమని వైద్యుడు నిర్ధారిస్తే.. ఆయన సూచన మేరకు EMT ఇంజక్షన్ ఇస్తారు.108 అంబులెన్సుల్లోని డోమ్ కెమెరాలను ERCతో అనుసంధానించారు. దీంతో అంబులెన్స్‌లోని బాధితుడిని వైద్యుడు ప్రత్యక్షంగా గమనిస్తూ అవసరమైన సూచనలు చేస్తారు.

ఇప్పటికే ముగ్గురికి ప్రాణరక్షణ

అయితే జూన్ 2025కు ముందు 108 అంబులెన్సుల్లో ASV అందుబాటులో లేదు. కానీ జూన్ 2025 నుంచి ఇప్పటివరకు 3,104 పాముకాటు అత్యవసర కాల్స్ రావడంతో దీన్ని ఎమర్జెసీగా భావించిన ప్రభుత్వం రాష్ట్రంలోని 108 అంబులెన్సుల్లో ASV అందుబాటులో తీసుకొచ్చింది. ఈ ఏఎస్‌వీలు అందుబాటులోకి వచ్చాక ఇప్పటికే కడప, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ముగ్గురు పాముకాటు బాధితులకు 108లోనే వైద్యుల సూచన మేరకు చికిత్స అందించి ప్రాణాలు కాపాడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఒక్కో ASV వయల్ ధర రూ.584.64 కాగా, మొత్తం రూ.5,28,514.56 విలువైన ASVను కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్..

పాముకాటు తర్వాత కనురెప్పలు వాలిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మింగడం కష్టంగా మారడం, మాట తడబడటం, ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే విషం నిదానంగా శరీరమంతా పాకుతుందని అర్థం. అలాగే ముక్కు, చిగుళ్లు, మూత్రంలో రక్తం కనిపించడం, కరిచిన చేయి లేదా కాలిలో వేగంగా వాపు రావడం, బొబ్బలు లేదా కణజాల నష్టం ఏర్పడటం వంటి లక్షణాలు కూడా ప్రమాద సంకేతాలుగా అధికారులు చెబుతున్నారు.

20 నిమిషాల రక్త పరీక్ష కూడా కీలకం..

పాము విషం రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందా లేదా తెలుసుకునేందుకు 20 నిమిషాల రక్త పరీక్ష చేస్తారు. శుభ్రమైన, పొడిగా ఉన్న గాజు గొట్టంలో తీసిన రక్తం 20 నిమిషాల తర్వాత కూడా గడ్డకట్టకపోతే విషప్రభావానికి సూచనగా పరిగణిస్తారు. ఈ వివరాలను ERC వైద్యుడికి EMT తెలియజేస్తారు.

గోల్డెన్ అవర్’పై ఫోకస్..

అత్యవసర వైద్యంలో తొలి గంట ఎంతో కీలకం. ఇప్పటికే 95 శాతానికి పైగా అత్యవసర కేసులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక పాముకాటు బాధితులకు అంబులెన్స్ ప్రయాణ సమయాన్ని కూడా చికిత్సకు ఉపయోగించుకోవడం ద్వారా మరిన్ని ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *