Headlines

ఒక్క మెసేజ్.. 34 ఏళ్ల దూరం మాయం..1992 నాటి పాత ఫొటో రీక్రియేట్.. నెటిజన్ల ఫిదా.. | IIM Lucknow Alumni Recreate 1992 Photo After 34 Years: Emotional Viral Reunion Story


నిజమైన స్నేహానికి కాలంతో పనిలేదు.. ఒక చిన్న మెసేజ్ చాలు దశాబ్దాల దూరాన్ని క్షణాల్లో చెరిపేయడానికి. సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన సంఘటనే ఐఐఎం లక్నో పూర్వ విద్యార్థుల జీవితంలో చోటుచేసుకుంది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ప్రాణస్నేహితులు ఏకంగా 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో మళ్లీ ఒకే గదిలో కలుసుకున్నారు. 1992లో తీసుకున్న తమ పాత ఫోటోను 2026లో అదే పోజుతో రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నారు. ఐఐఎం లక్నోలో చదువుకునే రోజుల్లో మనీష్ మహేశ్వరి, సంజయ్ శివ్నాని, సంజయ్ బన్సాల్, అజయ్ వర్మ, సుధాంశు మిశ్రాలు వైట్ హౌస్ అని పిలిచే హాస్టల్ భవనంలో కలిసి ఉండేవారు. కోర్సు ముగిశాక ఎవరి దారుల్లో వారు స్థిరపడ్డారు. అజయ్ వర్మ ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లగా.. మిగతా నలుగురు భారతదేశంలోనే వేర్వేరు రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అయితే సిడ్నీలో ఉంటున్న అజయ్ వర్మ పనిమీద ఢిల్లీకి వచ్చారని తెలుసుకున్న మనీష్ మహేశ్వరి వెంటనే ఓ వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. దానికి తమ పాత హాస్టల్ జ్ఞాపకార్థం ది వైట్ హౌస్ రీయూనియన్ అని పేరు పెట్టారు. ఆ ఒక్క గ్రూప్‌తో 1992 నుంచి 2026 మధ్య ఉన్న 34 ఏళ్ల దూరం ఒక్కసారిగా కరిగిపోయింది.

1992 నాటి ఫోటో.. 2026లో మళ్లీ ప్రత్యక్షం

1992లో ప్లేస్‌మెంట్స్ సమయంలో ఐదుగురు సూట్లు వేసుకుని దిగిన ఒక పాత ఫోటో వీరి వద్ద ఉంది. ఢిల్లీలో కలిసిన సందర్భంగా మనీష్ సూచనతో.. సరిగ్గా 34 ఏళ్ల క్రితం ఎలా నిలబడ్డారో, అదే క్రమంలో నిలబడి ఆ ఫోటోను మళ్లీ రీక్రియేట్ చేశారు. తలలు నెరిసినా, శరీరంలో మార్పులు వచ్చినా.. వారి ముఖాల్లోని నవ్వులు, చిన్ననాటి ఎక్స్‌ప్రెషన్లు మాత్రం అస్సలు మారలేదు.

34 ఏళ్లు గడిచినా మారని ఆ పాత ముచ్చట్లు

ఎన్నో ఏళ్ల తర్వాత కలిసినా వీరి మధ్య మాటలు పెద్దగా హోదాల గురించో, బిజినెస్ గురించో సాగలేదు. మళ్లీ కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోయి చిన్ననాటి హాస్టల్ అల్లర్లు, ప్రొఫెసర్ల సంగతులు, పనికిరాని విషయాలపై గంటల తరబడి చేసిన వాదనలే ప్రధానంగా నడిచాయి. ఈ ఐదుగురిలో సంజయ్ బన్సాల్ ఆయుర్వేదంపై చెప్పిన సరికొత్త సిద్ధాంతాలు, చిట్కాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 1992లో పాజ్ అయిన తమ స్నేహాన్ని 2026లో మళ్లీ ప్లే చేసినట్లుగా ఉందని వీరు భావోద్వేగంతో పంచుకున్నారు. కెరీర్లు, బాధ్యతలు వేరైనా.. నిజమైన స్నేహం ఎప్పటికీ మారదని ఈ ఐఐఎం మిత్రుల కలయిక చాటిచెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *