Headlines

కంటిచూపు కోల్పోయిన వారికి గుడ్‌న్యూస్..! వయోభారంతో వచ్చే దృష్టిలోపాన్ని ఇలా సరిచేయొచ్చు

కంటిచూపు కోల్పోయిన వారికి గుడ్‌న్యూస్..! వయోభారంతో వచ్చే దృష్టిలోపాన్ని ఇలా సరిచేయొచ్చు


కంటిచూపు కోల్పోయిన వారికి గుడ్‌న్యూస్..! వయోభారంతో వచ్చే దృష్టిలోపాన్ని ఇలా సరిచేయొచ్చు

మ్యాక్యులర్ డీజనరేషన్‌తో బాధపడుతున్న వృద్ధులు ఈ చిప్ సహాయంతో మళ్లీ పుస్తకాలు చదువుతూ, పజిల్స్ పూరిస్తున్నారు. కంటి వెనుక భాగంలో అమర్చే ఈ మైక్రోచిప్, ప్రత్యేక కళ్లజోడు టెక్నాలజీతో వైద్యరంగంలో విప్లవం సృష్టిస్తున్న ఈ ప్రిమా పరికరం పనితీరు, ఇతర ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం!

మ్యాక్యులర్ డీజనరేషన్‌కు చెక్..

ప్రపంచవ్యాప్తంగా వయసు పైబడిన లక్షలాది మంది ‘మ్యాక్యులర్ డీజనరేషన్’ సమస్యతో బాధపడుతున్నారు. ఇది కంటి వెనుక భాగంలో కాంతిని గ్రహించే కణాలను నాశనం చేయడం వల్ల పుస్తకాలు చదవడం, ముఖాలను గుర్తుపట్టడం కష్టమౌతుంది. అయితే ‘ప్రిమా’ పరికరం అమర్చుకున్న రోగులు మళ్లీ సాధారణంగా చదవగలుగుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ఒక రోగి ఈ చిప్ సహాయంతో ఏకంగా 300 పేజీల నవలను చదివి పూర్తి చేయడం విశేషం. మరొక పేషెంట్ సుడోకు, క్రాస్‌వర్డ్ పజిల్స్ పూర్తి చేసినట్లు పరిశోధకులు తెలిపారు.

ఎలా పనిచేస్తుంది?

ఈ పరికరాన్ని అమర్చడానికి ఒక గంట పాటు శస్త్రచికిత్స అవసరం అవుతుంది. ఈ ఆపరేషన్ ద్వారా కంటి వెనుక భాగంలో ఒక చిన్న మైక్రోచిప్‌ను అమరుస్తారు. దానికి అనుసంధానిస్తూ రోగులకు కెమెరాతో కూడిన ప్రత్యేక కళ్లజోడును అందిస్తారు. ఈ కళ్లజోడు దృశ్యాలను రికార్డు చేసి, కంటిలోని చిప్‌కు డిజిటల్ సంకేతాల రూపంలో సమాచారాన్ని పంపుతుంది. తద్వారా కంటి ముందు ఉన్న వస్తువులను వృద్ధులు స్పష్టంగా చూడగలుగుతారని పరిశోధకులు తెలియజేస్తున్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

సైన్స్ కార్పొరేషన్ సీఈఓ మాక్స్ హోడక్ గతంలో ‘న్యూరాలింక్’ సంస్థకు సహ-స్థాపకుడిగా వ్యవహరించారు. సిలికాన్ చిప్‌లు, జీవకణాల కలయికతో కొత్త తరహా బీసీఐ పరికరాలను తయారుచేయడానికి ఆయన ఈ సంస్థను స్థాపించారు. ఈ క్రమంలో 2024లో ‘పిక్సియమ్’ కంపెనీని కొనుగోలు చేసి ఈ ప్రిమా సాంకేతికతను వాణిజ్య స్థాయికి తీసుకువచ్చారు. ఒక్కో ప్రిమా పరికరం ధర కొన్ని లక్షల డాలర్లు ఉండవచ్చని అంచనా. వచ్చే సెప్టెంబర్ నాటికి జర్మనీలో మొదటి శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది.

అంధత్వంతో బాధపడుతున్న వృద్ధుల జీవితాల్లో ప్రిమా పరికరం సరికొత్త వెలుగులను నింపుతోంది. ఈ సాంకేతికత ద్వారా వచ్చే ఆదాయంతో భవిష్యత్తులో మరింత అధునాతన బయో-హైబ్రిడ్ బ్రెయిన్ సెన్సార్లను అభివృద్ధి చేయడమే తమ తుది లక్ష్యమని మాక్స్ హోడక్ తెలిపారు. వైద్యరంగంలో ఇదొక మైలురాయిగా నిలవనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *