Headlines

కొంపముంచిన నాలుగేళ్ల నాటి పెళ్లి వీడియో.. వేట మొదలు పెట్టిన పోలీసులు..! | Uttar Pradesh Wedding Firing: Viral 4 Year Old Video Sparks Bulandshahr Police Probe


బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఓ వివాహ వేడుకకు సంబంధించిన కాల్పుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి వేడుకలో ఓ యువకుడు పిస్టల్‌తో వరుసగా కాల్పులు జరుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సుమారు ఐదు సెకన్ల వ్యవధిలోనే 17 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో అధికారులు సుమోటోగా కేసును పరిశీలిస్తూ దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాథమిక విచారణలో వైరల్‌గా మారిన వీడియో సుమారు నాలుగేళ్ల నాటిదిగా పోలీసులు భావిస్తున్నారు. 2022లో ఖుర్జా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని స్థానికంగా ప్రముఖ మాంసం వ్యాపారి కుమారుడైన షాదాబ్‌గా గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే అతడి గుర్తింపుతో పాటు వీడియోలోని ఇతర అంశాలను అధికారికంగా నిర్ధారించాల్సి ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పిస్టల్‌పై కొనసాగుతున్న విచారణ

వీడియోలో కనిపిస్తున్న ఆయుధాన్ని కొందరు జిగానా పిస్టల్గా పేర్కొంటున్నారు. అయితే ఆయుధం అసలు ఏ రకానికి చెందినదో ఫోరెన్సిక్, పోలీసు విచారణ అనంతరం మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాల్పుల్లో ఉపయోగించిన ఆయుధం ఎవరి పేరుపై నమోదై ఉంది? దానికి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉందా? ఆయుధాన్ని ఉపయోగించిన వ్యక్తికి దానిని వినియోగించే చట్టబద్ధ అనుమతి ఉందా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వీడియోపై ఆధారాలు సేకరణ

ఖుర్జా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శోభిత్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. పెళ్లి వేడుకలో కాల్పులు జరుపుతున్న వీడియో పోలీసుల దృష్టికి వచ్చిందని ఖుర్జా ఎస్పీ తెలిపారు. వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించబడింది, అందులో కనిపిస్తున్న వ్యక్తులు ఎవరు, కాల్పులకు ఉపయోగించిన ఆయుధం చట్టబద్ధమైనదేనా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

వీడియో ప్రామాణికత, ఆయుధం లైసెన్స్, కాల్పుల పరిస్థితులు వంటి అంశాలపై పూర్తి స్థాయిలో నిర్ధారణ వచ్చిన తర్వాతే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు, నిఘా బృందాలు కలిసి ఆధారాలను సేకరిస్తున్నాయి. దర్యాప్తులో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *