Headlines

గాఢ నిద్రలో ఉలిక్కిపాటు.. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో మంటలు..! | Private Bus Catches Fire on NH 44: Hyderabad Bengaluru Route, Driver’s Quick Action Saves Lives


అనంతపురం: హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో NH-44పై ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపిస్తున్న సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. TG 13T 1985 నంబర్‌ గల ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తోంది. మిడుతూరు సమీపంలోకి చేరుకున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో ప్రయాణికులు హుటాహుటిన బస్సు నుంచి బయటకు దిగారు. డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.

మంటలు క్రమంగా బస్సు మొత్తం వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో NH-44పై కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బస్సు దగ్ధం కావడానికి అసలు కారణం ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్, సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు మంటలకు ఖచ్చితమైన కారణం చెప్పలేమని అధికారులు భావిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్‌–బెంగళూరు మార్గంలోని NH-44పై ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులకు సంబంధించిన ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజా ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టులో అనంతపురం జిల్లాలోనే హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురై పలువురు ప్రయాణికులు గాయపడిన ఘటన కూడా నమోదైంది.

ప్రస్తుతం తాజా ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక ప్రయాణికులను మరో వాహనంలో గమ్యస్థానాలకు చేర్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. పూర్తిగా దగ్ధమైన బస్సును తొలగించే చర్యలతో పాటు ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *