దేవశయని ఏకాదశితో చాతుర్మాసం ప్రారంభమైంది. ఏకాదశి నుంచి శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం లేదా చౌమాసం అని పిలుస్తారు. ఈ సమయంలో భక్తులు పూజలు, జపం, తపస్సు, ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. విష్ణు ఆరాధనతో ఈ కాలంలో చేసే పుణ్యకార్యాలకు విశేష ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. చాతుర్మాసం ముగిసే వరకు వివాహాలు, గృహప్రవేశాలు, తలనీలాల సమర్పణ వంటి శుభకార్యాలు సాధారణంగా నిర్వహించరు. దేవుత్థాన (ప్రబోధిని) ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటారని నమ్మకం. ఆ తర్వాతే శుభముహూర్తాలు తిరిగి ప్రారంభమవుతాయి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, ఈ చాతుర్మాస కాలంలో వృషభ, కర్కాటక, సింహ, తుల రాశుల వారికి విష్ణుమూర్తి ప్రత్యేక అనుగ్రహం లభించే అవకాశాలు ఉన్నాయని చెబుతారు.