Headlines

చేనేత కళాకారుడు నేసింది చీర కాదు..! దేశం మెచ్చిన కళాఖండం.. వరించిన జాతీయ పురస్కారం.. | This Is Not Just a Saree: A Handwoven Masterpiece Wins India’s National Award

చేనేత కళాకారుడు నేసింది చీర కాదు..! దేశం మెచ్చిన కళాఖండం.. వరించిన జాతీయ పురస్కారం.. | This Is Not Just a Saree: A Handwoven Masterpiece Wins India’s National Award


చేనేత కళాకారుల నైపుణ్యానికి.. వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఖండాంతర ఖ్యాతి ఆర్జించిన చేనేత ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి. సృజనాత్మకత, నూతన డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీతో తమదైన ప్రత్యేకతను ఏళ్లుగా చాటుతూ చేనేత కార్మికులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. అద్భుత పని తీరుతో తమ పూర్వీకుల వారసత్వాన్ని నేటి చేనేత కార్మికులు కొనసాగిస్తున్నారు.

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కు చెందిన గంజి వెంకటేష్ చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. పదో తరగతి వరకు చదువుకున్న వెంకటేష్.. వారసత్వంగా చేనేత వృత్తిలో కొనసాగుతూ తండ్రి బిక్షపతి నుంచి చేనేతలో మెళకువలు నేర్చుకున్నారు. 34 ఏళ్లుగా ఈ వృత్తినే కొనసాగిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. తన అద్భుతమైన కళా నైపుణ్యంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. వస్త్ర ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఇక్కత్ పద్ధతిలో మగ్గంపై చేతితో నూలు పోగుల్లో తెలంగాణ సంస్కృతి ఆవిష్కరించేలా చీరను నేయాలని వెంకటేష్ భావించాడు.

ప్రకృతి దృశ్యాల ఆవిష్కరణ..

ఈ చీరలో ప్రకృతిలోని ఇళ్లు, గుడారాలు, బాతులు, కుందేళ్లు, నీటి గుర్రం, చేపలు, పడవ, సీతాకోక చిలుకలు, పక్షులు వంటి పలు జీవాలు అద్భుతంగా చోటు దక్కించుకున్నాయి. ఆరు నెలల పాటు శ్రమించి గ్రాఫ్ పేపర్‌పై ఈ డిజైన్‌ను ఆయన రూపొందించారు.15 నెలల పాటు శ్రమించి ‘ఇక్కత్’ డిజైన్ తో ఆరు గజాల ప్రత్యేక పట్టు చీరను రూపొందించారు. ఈ చీర తయారీలో ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి నుంచి సేకరించిన రంగులనే వాడుకున్నారు. టీ పొడి, కొత్తిమీర, పుదీనా, కాచు, మంజిష్ట తదితర వస్తువులతో రంగులను తయారు చేశారు.

ఇవి కూడా చదవండి



300కు పైగా రంగుల చిటికిల కలయిక..

గ్రాఫ్‌కు అనుగుణంగా టై అండ్ డై పద్ధతిలో మల్బరీ పట్టు దారానికి 300 కొయ్యల చిటికికి రంగులద్దేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది. నెల రోజుల పాటు మగ్గంపై ఒక్కో పోగునూ అల్లి ఈ ప్రకృతి దృశ్యాన్ని చీరపై కళాత్మకంగా ఆవిష్కరించారు. ఈ చీరపై గ్రామీణ జీవనం… గుడులు… బతుకమ్మ… కుండలు… పల్లె సంస్కృతి… తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే ఎన్నో అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. ఇది వస్త్రం కాదు… నూలుతో గీసిన పెయింటింగ్. ప్రతి రంగు వెనుక ఓ లెక్క… ప్రతి డిజైన్ వెనుక ఓ కథ… ప్రతి అంగుళం వెనుక ఓ కళాకారుడి చెమట ఉంది.”

వెంకటేష్ కు జాతీయ పురస్కారం…

ప్రకృతిలోని జీవాలను అరుదైన పట్టు చీరపై ఆవిష్కరించిన వెంకటేష్ కు జాతీయ చేనేత పురస్కారం-2026కు ఎంపికయ్యాడు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆగస్టు 7న జరిగే 12వ జాతీయ చేనేత దినోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. దీనికి సంబంధించి డెవలప్‌మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. నెల రోజుల పాటు మగ్గంపై ఒక్కో పోగునూ అల్లి ఈ ప్రకృతి దృశ్యాన్ని చీరపై కళాత్మకంగా ఆవిష్కరించినట్లు చేనేత కళాకారుడు వెంకటేష్ చెబుతున్నాడు. జాతీయ పురస్కారం రావడం సంతోషంగా ఉందని, చేనేత ఆత్మగౌరవానికి జాతీయ గుర్తింపు దక్కిందనీ ఆయన చెబుతున్నాడు. ప్రస్తుత యాంత్ర యుగంలో చేనేత కళ అంతరించిపోకుండా భరోసా కల్పించాలని ఆయన పాలకులను కోరుతున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *