అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసదారులకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అక్కడి నిబంధనలను చాలా కఠినతరం చేస్తున్నారు. ఇప్పటికే హెచ్-1బీ వీసా ఫీజును విపరీతంగా పెంచడంతో పాటు అనేక మార్పులు చేశారు. ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త వచ్చింది!
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్ విషయంలో పదేళ్లకు పైగా అమల్లో ఉన్న ముఖ్యమైన విధానాన్ని రద్దు చేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే కనుక జరిగితే వేలాది మంది హెచ్-4 వీసా హోల్డర్లు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసే హక్కును కోల్పోనున్నారు. డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు ఇచ్చే వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని కొత్త ప్రతిపాదన తెచ్చింది. ఇది ఆమోదం పొందితే, పదేళ్లకు పైగా ఉద్యోగాలు చేస్తున్న హెచ్-4 వీసాదారులు అమెరికాలో తమ పని హక్కును కోల్పోతారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే ఉండటంతో, ఈ నిర్ణయం వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
H-1B వీసాదారుల జీవితభాగస్వాముల వర్క్ పర్మిట్ నిలిపివేత!
2014 నుంచి 2017 మధ్య హెచ్-4 ఈఏడీ (EAD) డేటా ప్రకారం.. మంజూరైన వర్క్ పర్మిట్లలో ఏకంగా 93 శాతం మంది భారతీయులే కాగా, వారిలో 94 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం. అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (DHS) తన తాజా పాలసీ ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చింది. “ఉద్యోగ అర్హత ఉన్న జాబితా నుంచి హెచ్-4 డిపెండెంట్ భాగస్వాములను తొలగించాలి” అనే పేరుతో నిబంధనలను సవరించాలని ప్రతిపాదించింది. 2015లో అమల్లోకి తెచ్చిన ఈ వర్క్ పర్మిట్ నిబంధనను పూర్తిగా రద్దు చేసి, ఆ కాలానికి ముందున్న పాత విధానాన్ని మళ్లీ తీసుకురావడమే తమ ప్రధాన ఉద్దేశమని డీహెచ్ఎస్ (DHS) స్పష్టం చేసింది.
అయితే, ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే, వెంటనే అమల్లోకి వచ్చే తుది నిర్ణయం కాదు. కాబట్టి హెచ్-4 వర్క్ పర్మిట్లు ఇప్పటికిప్పుడు రద్దు కావు. ఈ నిబంధన అమలు కావాలంటే ‘డీహెచ్ఎస్’ (DHS) ముందుగా ఫెడరల్ రిజిస్టర్లో అధికారిక నోటీసును విడుదల చేసి, ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను సేకరించాలి. ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. అప్పటివరకు హెచ్-4 వీసాదారులు యథావిధిగా ప్రస్తుత నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు.
హెచ్-4 వర్క్ పర్మిట్లను రద్దు చేయడానికి ప్రయత్నించడం ఇది మొదటిసారి కాదు. 2017లో డొనాల్డ్ ట్రంప్ తన మొదటి హయాంలో కూడా ఇటువంటి ప్రతిపాదనను తీసుకొచ్చారు. అయితే అప్పట్లో కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల దానిని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. చివరకు 2021 నాటికి ఆ ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అదే ప్రయత్నాలను పునరుద్ధరించడం ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.
హెచ్-1బీ ఫీజు పెంపు, గ్రేస్ పీరియడ్ కుదింపు
ట్రంప్ యంత్రాంగం హెచ్-1బీ వీసాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా 103,265 డాలర్లు అంటే రూ. 86 లక్షలకు పైగా పెంచాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదించింది.అలాగే, హెచ్-1బీ ఉద్యోగి ఎవరైనా సరే అనుకోకుండా ఉద్యోగం కోల్పోతే, కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను కూడా భారీగా తగ్గించాలని వైట్‌హౌస్ ఆలోచిస్తోంది. ఈ నిర్ణయాలు కనుక అమలైతే అమెరికాలో పనిచేస్తున్న నిపుణులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు.
హెచ్-4 వీసా, ఈఏడీ (EAD) నిబంధనలు
హెచ్-4 వీసా అనేది నేరుగా ఉద్యోగం చేసుకునేందుకు ఇచ్చే వీసా కాదు. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, పిల్లలు అమెరికాలో వారితో కలిసి నివసించడానికి మాత్రమే ఇది అనుమతిస్తుంది. హెచ్-4 వీసా ఉన్నవారు అక్కడ ఉద్యోగం చేయాలంటే ప్రత్యేకంగా ‘ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్’ (EAD) పొందాల్సి ఉంటుంది.
హెచ్-1బీ వీసా ఉన్న మీ భాగస్వామి గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాస హోదా) పొందే ప్రక్రియలో ఉంటేనే హెచ్-4 ఈఏడీ మంజూరు చేస్తారు. ఒకవేళ ఈఏడీ (EAD) లేకపోతే హెచ్-4 వీసాదారులు అమెరికాలో సాధారణంగా నివసించడానికి, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి మాత్రమే అర్హులుగా ఉంటారు తప్ప, అక్కడ ఎలాంటి ఉద్యోగం చేయడానికి చట్టపరంగా వీలుండదు.
యుఎస్సీఐఎస్ (USCIS) డేటా ప్రకారం.. 2024లో మంజూరైన హెచ్-1బీ వీసాల్లో ఏకంగా 71 శాతం భారతీయులవే. ఈ నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగం తెచ్చిన ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే, అమెరికాలోని వేలాది భారతీయ కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక, మానసిక భారం పడనుంది. ఇప్పటికే ఇక్కడ స్థిరపడిన డ్యూయల్ ఇన్‌కం (ఇద్దరూ సంపాదించే) కుటుంబాలు ఒక్కసారిగా సింగిల్ ఇన్‌కమ్‌కు పరిమితమయ్యే ప్రమాదం ఉంది