హైదరాబాద్లో అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా భర్త వేధింపులు భరిస్తున్న ఓ మహిళ.. చివరకు చట్టపరంగా భర్త నుంచి విడిపోయింది. అయితే భార్యాభర్తలు విడిపోయిన తర్వాత కూడా భర్త వేధింపులు ఆగలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.బాధితురాలికి వివాహమై ఎనిమిదేళ్లు అవుతోంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే అతడు గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
భర్తను మార్చేందుకు భార్య ఎన్నోసార్లు ప్రయత్నించినా పరిస్థితిలో మార్పు రాలేదని చెబుతున్నారు. చివరకు భర్తతో కలిసి జీవించడం సాధ్యం కాదని భావించిన ఆమె.. చట్టపరంగా భర్త నుంచి విడిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తాజాగా రాత్రి సమయంలో భర్త తన స్నేహితులతో కలిసి భార్య ఇంటికి దాడి చేశాడు. పిల్లలను తాను తీసుకెళ్లిపోతున్నానని, చివరిసారిగా వారిని చూసుకోవాలని చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన సీసీ కెమెరా ఫొటోస్ తో పాటు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబ సభ్యుల కళ్లల్లో కారం పొడి చల్లి, దాడి చేసి ముగ్గురు పిల్లలను తీసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. భర్త స్నేహితులు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడి ఘటనతో భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలిపారు. దాడిలో గాయపడిన బాధిత కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఘటనపై ఫలక్నుమా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు.