Headlines

టీమిండియాకు షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన టీమిండియా స్టార్.. 3వ మ్యాచ్ నుంచి ఔట్? | Prince yadav hamstring injury ind vs zim 2nd t20i match

టీమిండియాకు షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన టీమిండియా స్టార్.. 3వ మ్యాచ్ నుంచి ఔట్? | Prince yadav hamstring injury ind vs zim 2nd t20i match


Prince Yadav Injury: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత యంగ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ తీవ్ర గాయంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అద్భుత బౌలింగ్‌తో రెండు కీలక వికెట్లు తీసి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బతీసిన ప్రిన్స్, హ్యామ్‌స్ట్రింగ్ గాయం తిరగబెట్టడంతో అర్ధాంతరంగా మైదానం వీడాడు. దీంతో అతను తదుపరి మూడో టి20కి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సందేహంగా మారింది.

హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు జింబాబ్వేను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. టీమిండియా అందించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయి 17.5 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ అయింది. ఈక్రమంలో కొండంత టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వేను తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రిన్స్ యాదవ్ ఆరంభంలోనే వణికించాడు. మొదటి నుంచీ పదునైన యార్కర్లు, వేగవంతమైన బౌన్సర్లతో ప్రత్యర్థి బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు.

తన బౌలింగ్ స్పెల్ ప్రారంభించిన వెంటనే జింబాబ్వే ఓపెనర్ బెన్ కర్రన్‌ను అవుట్ చేసి టీమిండియాకు మొదటి బ్రేక్‌త్రూ అందించాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజాను బౌన్సర్‌తో బోల్తా కొట్టించి డకౌట్‌గా పెవిలియన్ పంపాడు. కేవలం 1.2 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసి జింబాబ్వే టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.

అర్ధాంతరంగా మైదానం వీడిన పేసర్..

ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో తన రెండో ఓవర్ బౌలింగ్ పూర్తి చేసే క్రమంలో ప్రిన్స్ యాదవ్ రన్ అప్‌లో ఒక్కసారిగా ఆగిపోయాడు. కుడి తొడ వెనుక భాగంలో (హ్యామ్‌స్ట్రింగ్) తీవ్రమైన నొప్పి కలగడంతో నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. వెంటనే టీమిండియా ఫిజియో మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, నొప్పులు తగ్గకపోవడంతో ప్రిన్స్ యాదవ్ కుంటికుంటూ మైదానాన్ని వీడాడు.

ప్రిన్స్ ఓవర్‌ను పూర్తి చేసేందుకు ఆల్ రౌండర్ శివమ్ దూబే బరిలోకి దిగి మిగిలిన బంతులను పూర్తి చేశాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఒక యంగ్ బౌలర్ ఈ విధంగా గాయం కారణంగా మైదానం వీడటం భారత బెంచ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, మేనేజ్‌మెంట్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

మూడో టీ20కి అందుబాటులో ఉంటాడా..?

జింబాబ్వేతో సిరీస్‌లో భారత ప్రధాన పేసర్ హర్షిత్ రాణా గాయపడటంతో అతని స్థానంలో రిప్లేస్‌మెంట్‌గా ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. దక్కిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకుని ఆకట్టుకుంటున్న వేళ, మళ్లీ గాయం బారిన పడటం అతడి కెరీర్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. హ్యామ్‌స్ట్రింగ్ గాయాలు కోలుకోవడానికి కనీసం ఒకరిరెండు వారాల సమయం పడుతుంది.

ఆదివారం జరగబోయే ఆఖరి, మూడో టీ20 మ్యాచ్ సమయానికి ప్రిన్స్ కోలుకోవడం దాదాపు అసాధ్యమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. బీసీసీఐ వైద్య బృందం ప్రస్తుతం అతని గాయం తీవ్రతను పర్యవేక్షిస్తోంది. ఒకవేళ ప్రిన్స్ కోలుకోకపోతే మూడో టీ20లో అతని స్థానంలో అశోక్ శర్మకు లేదా వేరే ఫాస్ట్ బౌలర్‌కు అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *