Headlines

బంగారంలాంటి ఆరోగ్యానికి పంచామృతం పాలు.. 30 రోజులు ఇలా తీసుకున్నారంటే తిరుగులేదు..!


బంగారంలాంటి ఆరోగ్యానికి పంచామృతం పాలు.. 30 రోజులు ఇలా తీసుకున్నారంటే తిరుగులేదు..!

ప్రస్తుత బిజీ జీవనశైలిలో ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. మన ఆయుర్వేదంలో పాలు, పసుపు, అల్లం, కుంకుమపువ్వు కలయికను శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. సాధారణంగా మన ఇళ్లలో తయారుచేసే ఈ ఆయుర్వేద పానీయం శరీరానికి అమృతంలా పనిచేస్తుంది.

రాంచీకి చెందిన ఆయుర్వేద వైద్యుడు వి.కె. పాండే ప్రకారం, ఈ పాలు తాగడం వల్ల జలుబు, దగ్గు నయమవుతాయి. ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. ఇది ముఖానికి కాంతినిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు సర్వసాధారణంగా ఉన్నప్పుడు ఈ పాలు ఔషధంలా పనిచేస్తాయని డాక్టర్ పాండే వివరించారు. రాత్రిపూట ఈ పాలు తాగడం వల్ల ఉదయాన్నే ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. తయారీ విధానం, కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు..

పాలు: 2 కప్పులు (చిక్కటివి లేదా ప్లాంట్-బేస్డ్ పాలు)

పసుపు పొడి / పసుపు కొమ్ము తురుము: 1/2 టీస్పూన్

అల్లం తురుము: 1/2 టీస్పూన్

కుంకుమపువ్వు రేకులు: 5-6

మిరియాల పొడి: చిటికెడు (పసుపులోని గుణాలు శరీరానికి త్వరగా పట్టడానికి)

తేనె లేదా బెల్లం: రుచికి సరిపడా

తయారుచేసే విధానం:

ఒక గిన్నెలో పాలు పోసి స్టవ్ మీద సన్నని మంటపై వేడి చేయాలి. పాలు కాస్త వేడెక్కిన తర్వాత అందులో పసుపు, అల్లం తురుము, మిరియాల పొడి, కుంకుమపువ్వు రేకులు వేయాలి. మంటను తక్కువగా ఉంచి ఈ మిశ్రమాన్ని 5 నుండి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి. దీనివల్ల మూలికలలోని పోషకాలన్నీ పాలల్లోకి చేరుతాయి. పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపి, పాలను కప్పులోకి వడకట్టుకోవాలి. పాలు కాస్త గోరువెచ్చగా మారిన తర్వాత రుచి కోసం తేనె లేదా బెల్లం కలుపుకుని తాగొచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు:

పసుపులోని కర్క్యుమిన్, అల్లంలోని యాంటీఆక్సిడెంట్స్ బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. ఈ పాలలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులను నయం చేయడంలో ఎంతో సాయపడతాయి. కుంకుమపువ్వు మానసిక ఒత్తిడిని తగ్గించి, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. రాత్రి వేళ గోరువెచ్చని ఈ పాలను తాగితే సుఖనిద్ర పడుతుంది.

అల్లం, మిరియాల పొడి జీర్ణశక్తిని పెంచి, గ్యాస్, ఉబ్బరం సమస్యలను నివారిస్తాయి. ఈ పాలను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు చర్మ కాంతి కూడా పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *