రాజస్థాన్‌లోని జైపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నహర్‌గఢ్ బయోలాజికల్ పార్క్‌లో శివాజీ అనే పులి దాడి చేయడంతో ఓ మహిళ మృతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో పార్క్ పరిసరాల్లో కలకలం రేగింది. మృతురాలిని జైపూర్‌లోని నంగల్ ప్రాంతానికి చెందిన సుగ్నగా గుర్తించినట్లు తెలుస్తోంది.
సుగ్న పార్క్‌లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఉదయం శివాజీ పులి ఎన్‌క్లోజర్ పరిసరాల్లో ఆమె పనులు చేస్తుండగా ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. దాడికి దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. అయితే దాడి ఎలా జరిగింది? ఆమె ఎన్‌క్లోజర్‌లోకి ఏ పరిస్థితుల్లో వెళ్లారు? భద్రతా నిబంధనలు పాటించారా? అనే అంశాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. సుగ్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నిరసనకు సిద్ధమయ్యారు. మహిళా కార్మికురాలి మృతితో నహర్‌గఢ్‌లో విషాదం నెలకొనగా.. కుటుంబ సభ్యుల డిమాండ్లతో జైపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మరోవైపు నహర్‌గఢ్ బయోలాజికల్ పార్క్‌లో పులుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాణి అనే ఆడపులి ఐదు పిల్లలకు జన్మనివ్వడంతో పార్క్‌లో మొత్తం పులుల సంఖ్య 14కు చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పులుల సంరక్షణతో పాటు సందర్శకులు, సిబ్బంది భద్రతపై మరింత అప్రమత్తత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..