Headlines

బాల్యానికి పుస్తెల బంధం.. బడి చదువు పూర్తికాకుండానే పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్! | Karnataka Tops Major States in Girls’ Secondary School Dropout Rate: UDISE Report

బాల్యానికి పుస్తెల బంధం.. బడి చదువు పూర్తికాకుండానే పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్! | Karnataka Tops Major States in Girls’ Secondary School Dropout Rate: UDISE Report


న్యూఢిల్లీ, జులై 28: సెకండరీ స్కూల్ (9వ, 10వ తరగతులు) దశలో చదువును మధ్యలోనే మానేస్తున్న బాలికల సంఖ్యలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక తొలి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన UDISE+ 2025-26 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. విద్యారంగంలో వెనుకబడిన రాష్ట్రాలుగా భావించే బీహార్, ఉత్తరప్రదేశ్‌లతో పోలిస్తే కూడా కర్ణాటకలో బాలికల డ్రాపౌట్ రేటు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదిక ప్రకారం 2025-26 విద్యా సంవత్సరంలో కర్ణాటకలో సెకండరీ స్థాయిలో బాలికల డ్రాపౌట్ రేటు 13.9 శాతం నమోదైంది. ఇది దేశ సగటు 8 శాతం కంటే గణనీయంగా ఎక్కువ. అయితే గత మూడు సంవత్సరాలతో పోలిస్తే కర్ణాటకలో కొంత మెరుగుదల కనిపించింది. 2023-24లో 19.6 శాతం, 2024-25లో 14.6 శాతంగా ఉన్న డ్రాపౌట్ రేటు ప్రస్తుతం 13.9 శాతానికి తగ్గింది. అయినప్పటికీ ఇతర రాష్ట్రాల పురోగతితో పోలిస్తే ఈ మార్పు ఆశించిన స్థాయిలో లేదని నివేదిక పేర్కొంది.

మెరుగుపడిన బీహార్

ఒకప్పుడు విద్యారంగంలో వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్ డ్రాపౌట్‌ల నియంత్రణలో గణనీయమైన పురోగతిని సాధించింది. 2023-24లో 25.1 శాతంగా ఉన్న బాలికల డ్రాపౌట్ రేటు, 2025-26 నాటికి 9.1 శాతానికి తగ్గింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఈ రేటు 7.3 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో అత్యధికంగా 15.6 శాతం డ్రాపౌట్ రేటు నమోదైంది. పెద్ద రాష్ట్రాల పరంగా కర్ణాటక, అస్సాం రెండూ 13.9 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు బాలికల విద్య కొనసాగింపులో ఆదర్శంగా నిలిచాయి. కేరళలో డ్రాపౌట్ రేటు 3 శాతం, తమిళనాడులో 3.2 శాతం మాత్రమే ఉంది. అలాగే హర్యానాలో 3.8 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలు కర్ణాటకతో పోలిస్తే ఇతర రాష్ట్రాలు బాలికల విద్యను కొనసాగించడంలో మెరుగైన ఫలితాలు సాధించినట్లు సూచిస్తున్నాయి.

సెకండరీ స్థాయిలో బాలికలు చదువు మానేయడానికి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు, బాల్య వివాహాలు, రవాణా సౌకర్యాల కొరత, సామాజిక కారణాలు వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయని విద్యా నిపుణులు చెబుతున్నారు. బాలికల విద్య కొనసాగింపుకు ప్రభుత్వం, పాఠశాలలు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *