Headlines

Video: ఆటగదరా శివ.. పిల్లాడి మెడకు చుట్టుకున్న నాగుపాము.. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడండి.. | 4 Foot Cobra Wraps Around Sleeping 5 Year Old boy Neck in Bihar, Watch Viral Video

Video: ఆటగదరా శివ.. పిల్లాడి మెడకు చుట్టుకున్న నాగుపాము.. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడండి.. | 4 Foot Cobra Wraps Around Sleeping 5 Year Old boy Neck in Bihar, Watch Viral Video


పాము అంటేనే ఆమడదూరం పరిగెడతాం. కానీ ఓ చోట నిద్రపోతున్న 5 ఏళ్ల పసివాడి మెడను చుట్టేసింది భారీ నాగుపాము. ఏకంగా గంటపాటు పడగ విప్పి అతని ముఖం ముందే కూర్చుంది. కానీ ఆ బాలుడికి ఎలాంటి హానీ తలపెట్టలేదు. వినడానికే ఒళ్ళు గగుర్పొడిచే ఈ సంఘటన బీహార్‌లోని పాట్నా జిల్లా బుద్ధువాచక్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన రామ్మూర్తి మహతో ఇంటికి ఆయన కూతురు శరథ, తన కొడుకుతో కలిసి బహదూర్‌పూర్ నుంచి వచ్చింది. సోమవారం ఉదయం నిద్రలేచిన శరథ.. పక్కన పడుకున్న కొడుకు వైపు చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. నాలుగడుగుల పొడవైన ఒక నాగుపాము బాబు ఛాతీ పైనుంచి పాకుతూ వచ్చి మెడను చుట్టుకుని, ముఖం దగ్గర పడగ విప్పి కూర్చుంది. అది చూసి ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పరుగున అక్కడకు చేరుకున్నారు.

గంటపాటు ఊపిరి బిగబట్టిన గ్రామస్థులు..

మంచంపై ఉన్న పామును చూసి ఇంట్లో ఉన్నవారంతా భయంతో వణికిపోయారు. బాబును కాపాడేందుకు ముందుకు వెళ్లే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. పామును ఏమైనా కదిలిస్తే అది ఎక్కడ కాటేస్తుందోనని భయపడ్డారు. బాబు కూడా నిద్రలో ఏమాత్రం కదిలినా ప్రమాదమని భావించి, పక్కనే నిశబ్దంగా నిలబడి ఆ దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. బాబు గాఢనిద్రలో ఏమాత్రం కదలకుండా పడుకోగా.. పాము మాత్రం గంటపాటు అతని మెడను చుట్టుకుని పడగ విప్పే కూర్చుంది.

నిద్రలేవగానే జారిన నాగుపాము..

దాదాపు గంట తర్వాత ఆ బాబు నిద్రలేచాడు. చుట్టూ అంతమంది జనాన్ని చూసి ఆ బాబు ఏడుస్తూ, మంచం మీద నుంచి లేచి తల్లి వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆశ్చర్యకరంగా.. బాబు కదిలినప్పటికీ ఆ నాగుపాము ఎలాంటి కోపం ప్రదర్శించకుండా, చాలా నెమ్మదిగా చిన్నారి మెడ నుంచి కిందకు జారి గది బయటకు వెళ్లిపోయింది. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తల్లి వెంటనే కొడుకుని గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ దృశ్యం చూసిన గ్రామస్థులు ఇది కేవలం ఆ దేవుడి దయ, ఒక పవిత్రమైన అద్భుతమని అంటున్నారు.

సోషల్ మీడియాలో వైరల్.. నిపుణుల హెచ్చరిక..

ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆ బాలుడు అదృష్టవంతుడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు కంగారుపడి సొంతంగా ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు లేదా స్నేక్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించడమే అత్యంత సురక్షితమైన మార్గమని సూచిస్తున్నారు.

వీడియో చూడండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *