ఇప్పుడు అదే కడాయిని తిరిగి స్టవ్ మీద పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత, 1/3 కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని వేసి, చిన్న మంట మీద నిదానంగా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి. ఇది కుడుములకు మంచి రుచిని, సువాసనను ఇస్తుంది. ఇక కొబ్బరి వేగిన తర్వాత, ముందుగా వడకట్టుకున్న బెల్లం నీటిని ఇందులో పోయాలి. చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలి. మంటను లో ఫ్లేమ్‌లోకి తగ్గించి, ఒక కప్పు బియ్యం పిండిని నెమ్మదిగా వేస్తూ గరిటతో ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. పిండి బాగా దగ్గరపడి, గట్టి ముద్దలా మారే వరకు కలుపుతూ ఉడికించాలి.