Headlines

మాయదారి పాము.. హాస్టల్‌లో నిద్రపోతున్న ఆరుగురిని కాటేసిన కాలనాగు. ముగ్గురు మృతి! | A venomous snake bit six students sleeping in hostel; three died another is in critical in Gadchiroli District

మాయదారి పాము.. హాస్టల్‌లో నిద్రపోతున్న ఆరుగురిని కాటేసిన కాలనాగు. ముగ్గురు మృతి! | A venomous snake bit six students sleeping in hostel; three died another is in critical in Gadchiroli District


మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ సహాయం పొందుతున్న ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో నిద్రిస్తున్న విద్యార్థులను పాము కాటేయడంతో ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌కు తరలించారు. ఈ ఘటనతో విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

గడ్చిరోలి జిల్లా జప్తలై గ్రామంలోని ప్రాథమిక-మాధ్యమిక ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో సోమవారం (ఆగస్టు 10) తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. హాస్టల్‌లో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థులను పాము కాటేసినట్లు అధికారులు తెలిపారు. కాటు ప్రభావంతో విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని తొలుత సమీపంలోని గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో గడ్చిరోలి జిల్లా జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

అయితే చికిత్స పొందుతూ ముగ్గురు విద్యార్థినులు మృతి చెందారు. మృతుల వయస్సు 8, 12, 14 సంవత్సరాలుగా అధికారులు తెలిపారు. మిగిలిన ముగ్గురు విద్యార్థినులకు వైద్యులు చికిత్స కొనసాగించారు. వారిలో ఓ బాలిక పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం, గడ్చిరోలి పోలీసులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. అత్యవసరంగా ఆమెను హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌లోని జీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అధునాతన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ ఘటనపై మృతుల కుటుంబాలు, గ్రామస్థులు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. హాస్టల్‌లో విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం జరిగిందని, పాము కాటేసిన తర్వాత తీసుకున్న చర్యలు కూడా సకాలంలో లేవని వారు ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గడ్చిరోలి జిల్లాకు చెందిన మంత్రి ఆశిష్ జైస్వాల్ పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మిగిలిన విద్యార్థులకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ఆరోగ్యశాఖ, జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాయి.

హాస్టల్‌లోకి పాము ఎలా ప్రవేశించింది? విద్యార్థులకు సకాలంలో వైద్యం అందిందా? పాఠశాల యాజమాన్యం భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం చేసిందా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆశ్రమ పాఠశాల హాస్టళ్లలో విద్యార్థుల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *