Headlines

రోజుకో కొత్త రూట్.. మెదడుకు సూపర్ బూస్ట్.. ట్యాక్సీ డ్రైవర్ల దెబ్బకు ఆ రోగం పని ఖతం.. | Why Taxi Drivers Have a Lower Risk of Alzheimers, New Study Explains


మతిమరుపు సమస్య అయిన అల్జీమర్స్ వృద్ధాప్యంలో చాలామందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్య. అయితే ఇతర వృత్తులతో పోలిస్తే టాక్సీ డ్రైవర్లలో అల్జీమర్స్ సంబంధిత మరణాల రేటు గణనీయంగా తక్కువగా ఉందని అమెరికాలో నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిరంతరం కొత్త మార్గాలను ఎంచుకోవడం, రోడ్లు, లొకేషన్లను గుర్తుంచుకోవడం వంటి పనులు వారి మెదడుకు నిరంతరం వ్యాయామం అందించడమే ఇందుకు కారణమని పరిశోధకులు గుర్తించారు. టాక్సీ నడిపే సమయంలో డ్రైవర్లు ఏ మార్గంలో వెళ్లాలి, ట్రాఫిక్ ఉంటే ప్రత్యామ్నాయ దారులు ఏవి, నిర్దిష్ట ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి వంటి ఎన్నో విషయాలను ఎప్పటికప్పుడు మెదడులో ప్రాసెస్ చేస్తుంటారు. మెదడులోని హిప్పోకాంపస్ అనే భాగం స్థాన నిర్దేశక, దిశానిర్దేశక విధులను నియంత్రిస్తుంది. సాధారణంగా అల్జీమర్స్ వ్యాధి సోకినప్పుడు మొదటగా దెబ్బతినే భాగాలలో ఈ హిప్పోకాంపస్ ప్రధానమైనది. నావిగేషన్ ప్రక్రియ ద్వారా ఈ ప్రాంతం నిరంతరం చురుగ్గా పనిచేస్తుండటం పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది.

లండన్ క్యాబ్ డ్రైవర్ల బ్రెయిన్ స్కాన్లలోనూ అదే ఫలితం

గతంలో లండన్ టాక్సీ డ్రైవర్లపై నిర్వహించిన అధ్యయనాల్లోనూ ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. లండన్ నగరంలోని వేలాది రోడ్లు, మైలురాళ్లను గుర్తుపెట్టుకోవడానికి వారు పొందే కఠినమైన శిక్షణ వల్ల వారి మెదడులోని హిప్పోకాంపస్ పరిమాణంలో, నాడీ కణాల పనితీరులో సానుకూల మార్పులు జరిగినట్లు బ్రెయిన్ స్కాన్‌లు స్పష్టం చేశాయి.

బస్సు డ్రైవర్లు, పైలట్లకు ఎందుకు ఆ ప్రయోజనం లేదు?

ఈ అధ్యయనంలో మరో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. ప్రతిరోజూ ఒకే నిర్ణీత మార్గాల్లో ప్రయాణించే బస్సు డ్రైవర్లు, ముందుగానే నిర్దేశించిన మార్గాల్లో ప్రయాణించే విమాన పైలట్లలో ఈ అల్జీమర్స్ మరణాల రేటు తక్కువగా కనిపించలేదు. కానీ టాక్సీ, అంబులెన్స్ డ్రైవర్లు నిరంతరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలను తక్షణమే నిర్ణయించుకోవాల్సి రావడం వల్ల వారి మెదడు నిరంతరం సవాలును ఎదుర్కొంటూ చురుగ్గా ఉంటోందని విశ్లేషించారు.

మెదడుకు నిరంతర కసరత్తు ముఖ్యం

టాక్సీ నడపడం వల్ల మాత్రమే అల్జీమర్స్ పూర్తిగా రాకుండా పోతుందని నిర్ధారించలేమని, దీనిపై మరింత లోతైన పరిశోధనలు జరగాల్సి ఉందని నిపుణులు స్పష్టం చేశారు. అయితే మెదడు చురుకుదనాన్ని కాపాడుకోవడానికి నిత్యం కొత్త విషయాలను నేర్చుకోవడం, జ్ఞాపకశక్తికి పనిచెప్పడం, మెదడును సవాలు చేసే పజిల్స్, వ్యూహాత్మక ఆలోచనల్లో పాల్గొనడం ఎంతో అవసరమని ఈ అధ్యయన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *