Headlines

Hyderabad: ఫొటోలో చూసి అమాయకుడు అనుకునేరు.. చేసిన పని తెలిస్తే.. | Hyderabad CCS Police Arrest Inter State Fraudster in Multi Crore Property Loan Scam


హైదరాబాద్‌లో భూములు, స్థలాలపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించి కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర కేటుగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తులపై రుణాలు ఇప్పిస్తామని బాధితులను నమ్మించి.. వారి నుంచి సేల్ డీడ్ పత్రాలు తీసుకుని.. వాటిని దుర్వినియోగం చేసి మూడో వ్యక్తుల పేరిట ఆస్తులు బదలాయించడం.. అనంతరం అదే ఆస్తులను బ్యాంకుల్లో కుదువపెట్టి భారీగా రుణాలు పొందడం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన నునావత్ యుగంధర్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో యుగంధర్‌పై 20కి పైగా క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా ఓ బాధితుడికి రూ.60 లక్షల ఆర్థిక సాయం చేసిన యుగంధర్.. ఆస్తిని వేరొకరికి విక్రయించనంటూ MOU చేసుకున్నాడు. అనంతరం సేల్ డీడ్‌ను దుర్వినియోగం చేసి.. బాధితుడికి తెలియకుండానే ఆస్తిని మూడో వ్యక్తి పేరిట మార్చేశాడు.

ఆ తర్వాత అదే ఆస్తిని కుదువపెట్టి యాక్సిస్ బ్యాంక్ నుంచి సుమారు రూ.1.50 కోట్ల రుణం తీసుకున్నాడు. రుణం చెల్లించకుండా డిఫాల్ట్ కావడంతో బ్యాంకు అధికారులు బాధితుడికి నోటీసులు పంపారు. దీంతో అసలు మోసం బయటపడింది. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు.. యుగంధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడి మోసాల చిట్టా బయటపడింది. ఆస్తులపై రుణాలు ఇప్పిస్తామంటూ 30 మందికి పైగా అమాయకులను నమ్మించి.. రూ.10 కోట్లకు పైగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇప్పటికే యుగంధర్‌పై 12 క్రిమినల్ కేసులు, 8 సివిల్, NI యాక్ట్ కేసులు నమోదై ఉన్నాయి. మరో నాలుగు కేసుల్లో అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. భూములపై రుణాలు ఇప్పిస్తామంటూ వచ్చే నకిలీ ఫైనాన్స్ కన్సల్టెన్సీలు, మధ్యవర్తుల మాటలు నమ్మి ఆస్తి పత్రాలను అప్పగించవద్దని సీసీఎస్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. పత్రాలు ఇచ్చే ముందు పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *