స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు మంత్రి దామోదర రాజనర్సింహా ఇద్దరు ఎమ్మెల్సీలపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులు ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని తీర్మానం చేశారు. అయితే.. అసెంబ్లీ తీర్మానం కాపీని మండలి చైర్మన్ కు పంపించాలని సభ్యులు నిర్ణయించారు. కాగా.. స్పీకర్‌పై నిన్నటి అనుచిత వ్యాఖ్యల అంశంపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ నడుస్తోంది. సభాపతిని ఉద్దేశించి తాతా మధు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్, మిత్రపక్షాలు తప్పుబట్టాయి. తెలంగాణ శాసనసభ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది. అయితే బోయిన్పల్లి PS నుంచి అసెంబ్లీకి కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు బయల్దేరారు.
స్పీకర్‌పై వ్యాఖ్యలను నిన్ననే ఖండించామనీ, అయితే ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడం కూడా తప్పే అని బీజేపీ పక్ష నేత ఏలేటి అన్నారు. కేటీఆర్, నవీన్‌రెడ్డి పోలీసుల గల్లాలు పట్టుకున్నారనీ, పోలీసులపై దాడి చేసినవారిపై హత్యా నేరం కేసులు పెట్టాలని ఆది శ్రీనివాస్ చెప్పారు. అయితే స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని అనిరుధ్ రెడ్డి చెప్పారు. తాతా మధు చేత కేసీఆర్ క్షమాపణలు చెప్పించాలని అక్బరుద్దీన్ అన్నారు. తల్లులను తిట్టే హక్కు వీళ్లకు ఎవరు ఇచ్చారని కూనంనేని ప్రశ్నించారు. ఇక స్పీకర్ పరువు కాపాడాల్సిన బాధ్యత మా అందరిపై ఉందని కాంగ్రెస్ MLA పద్మావతి అన్నారు.
సభలో నిన్నటి ఘటనపై చిట్‌చాట్‌లో స్పకర్ గడ్డం ప్రసాద్ కీలకవ్యాఖ్యలు చేశారు. సభ సజావుగా సాగాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు. సభా సంప్రదాయాలను కేసీఆర్ గౌరవించాలనీ, ఆయన అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పాలన్నారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్‌కు పోన్ చేసి మాట్లాడుతాననీ, ఈ సారి కూడా కేసీఆర్‌కి ఫోన్ చేసి మాట్లాడినట్టు స్పీకర్ చెప్పారు. ఆరోగ్యం సహకరిస్తే సభకు వస్తానని కేసీఆర్ చెప్పినట్టు స్పీకర్ చిట్‌చాట్‌లో చెప్పారు. నిన్నటి వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెందానని స్పీకర్ ప్రసాద్ చెప్పారు. హరీష్‌కు మైక్ ఇస్తే క్షమాపణ చెబుతారని అనుకున్నాననీ, కానీ డైవర్షన్ చేసే ప్రయత్నం చేశారన్నారు. అందుకే సీరియస్ కావాల్సి వచ్చిందని స్పీకర్ ప్రసాద్ వివరించారు.
స్పీకర్‌పై వ్యాఖ్యల అంశంలో మండలిలోనూ మంటలు రేగాయి. రాష్ట్రంలో BRS ఉండటానికి వీల్లేదనీ, ఆ పార్టీని రద్దుచేయాలని కాంగ్రెస్ సభ్యుడు మహేష్‌గౌడ్ డిమాండ్ చేశారు. మరోవైపు మహిళా ఎమ్మెల్యేలను ముందుపెట్టింది ఎవరనీ, మహిళా సభ్యుల ముందు చొక్కాలు విప్పింది ఎవరు అని సీతక్క ప్రశ్నించారు. ఇక BRS సభ్యులు ఎంత మాట్లాడినా అవమానం వెనక్కి రాదని మంత్రి జూపల్లి చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..