Headlines

పెళ్లి కాగానే హోటల్ గదికి కొత్త జంట! కేసు పెట్టిన భార్య.. రూమ్ నెం.108లో ఏం జరిగింది?

పెళ్లి కాగానే హోటల్ గదికి కొత్త జంట! కేసు పెట్టిన భార్య.. రూమ్ నెం.108లో ఏం జరిగింది?


పెళ్లి కాగానే హోటల్ గదికి కొత్త జంట! కేసు పెట్టిన భార్య.. రూమ్ నెం.108లో ఏం జరిగింది?

హైదరాబాద్‌లో ఓ నవ వధూవరుల వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పెళ్లైన కొన్ని గంటల్లోనే భార్యాభర్తల మధ్య మొదటి భార్య, ఐదుగురు పిల్లల విషయంపై గొడవ జరిగినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. షాపింగ్‌కు తీసుకెళ్తానని చెప్పి హోటల్‌కు తీసుకెళ్లిన భర్త.. అక్కడ తనపై చేయి చేసుకోవడంతో పాటు గదిలో పెట్టి బయటి నుంచి తలుపు వేసి వెళ్లిపోయాడని ఆమె ఆరోపించింది. నవ దంపతుల మధ్య తొలి రోజే జరిగిన ఈ గొడవపై బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతబస్తీ షాహీన్‌నగర్‌కు చెందిన 25 సంవత్సరాల యువతికి మహమ్మద్ యాసీన్‌తో ఆగస్టు 4న వివాహం జరిగింది. చింతల్‌మెట్‌లోని అర్మాన్ హోటల్ సమీపంలోని ఖాజీ హౌస్‌లో సాయంత్రం 5 గంటల సమయంలో వీరి వివాహం జరిగినట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.

పెళ్లి జరిగిన అదే రోజు సాయంత్రం షాపింగ్‌కు తీసుకెళ్తానని యాసీన్ చెప్పడంతో అతడితో కలిసి యాక్టివా స్కూటర్‌పై బయలుదేరినట్లు యువతి తెలిపింది. తొలుత ఇద్దరూ ఆరాంఘర్‌లోని ఓ మండి రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి సుమారు 8.30 గంటలకు బహదూర్‌పురా ఎక్స్‌రోడ్డులోని క్యాపిటల్ హోటల్‌కు వెళ్లారు. రూమ్ నంబర్ 108లోకి వెళ్లిన తర్వాతే అసలు గొడవ మొదలైనట్లు ఆమె పోలీసులకు తెలిపింది.

హోటల్ గదిలో మొదటి భార్య ప్రస్తావన..

గదిలో ఉన్న సమయంలో యాసీన్ మొదటి భార్య, ఐదుగురు పిల్లల విషయం ప్రస్తావనకు వచ్చిందని యువతి పేర్కొంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైందని తెలిపింది. మాటామాటా పెరగడంతో యాసీన్ తన ఎడమ చెంపపై కొట్టడంతో పాటు కిందకు తోసేశాడని ఆమె ఆరోపించింది. దీంతో తనకు గాయాలయ్యాయని, అసభ్య పదజాలంతో దూషించాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది.

గొడవ తర్వాత యాసీన్ గది నుంచి బయటకు వెళ్లి తలుపును బయటి నుంచి గడియ పెట్టాడని యువతి ఆరోపించింది. దీంతో తాను గదిలోనే ఉండిపోయానని తెలిపింది. దాదాపు రెండు గంటల తర్వాత యాసీన్ తిరిగి వచ్చి తలుపు తెరిచి తనను ఇంటికి పంపించినట్లు పోలీసులకు వివరించింది. పెళ్లైన రోజే జరిగిన ఈ పరిణామాలతో యువతి మరుసటి రోజు బహదూర్‌పురా పోలీసులను ఆశ్రయించింది. తనపై దాడి చేసి, గదిలో నిర్బంధించడంతో పాటు దూషించాడని ఆరోపిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. యువతి ఫిర్యాదును స్వీకరించిన బహదూర్‌పురా పోలీసులు క్రైమ్ నంబర్ 232/2026 కింద కేసు నమోదు చేశారు. BNS సెక్షన్లు 115(2), 127(4), 79 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసుల తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *