
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సంఘటనలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి ఆసక్తికరమైన, నాటకీయ పరిణామాలకు వేదికైన చిత్రం 1980లో విడుదలైన బండోడు-గుండమ్మ. ఈ సినిమా హీరో మార్పు వెనుక ఉన్న కథ దర్శక రత్న దాసరి నారాయణరావు సాహసోపేత నిర్ణయానికి, సూపర్ స్టార్ కృష్ణ గొప్ప మనసుకి నిదర్శనం. ఈ సంఘటనను సీనియర్ దర్శకులు నందం హరిశ్చంద్రరావు స్వయంగా వెల్లడించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, దర్శక రత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్లో వచ్చిన కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ వంటి చిత్రాలు విజయవంతం కావడంతో, నిర్మాత జీవీఎన్ రాజు వీరిద్దరితో కలిసి బండోడు-గుండమ్మ చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఈ ప్రాజెక్ట్‌కు కృష్ణంరాజు, దాసరి ఇద్దరూ అంగీకరించారు. జయప్రదను కథానాయికగా ఎంపిక చేయగా, 1980 ఏప్రిల్ 10న చెన్నైలోని అరుణాచలం స్టూడియోలో సినిమా షూటింగ్ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరికీ ఆహ్వాన పత్రికలు వెళ్లాయి. అయితే, షూటింగ్ ప్రారంభానికి సరిగ్గా ఒక రోజు ముందు, అంటే 1980 ఏప్రిల్ 9న, రెబల్ స్టార్ కృష్ణంరాజు నిర్మాత జీవీఎన్ రాజుకు కబురు పంపారు. జీవీఎన్ రాజు ఆయన్ను కలిసినప్పుడు, కృష్ణంరాజు ఒక షరతు విధించారు. “నేను ప్రస్తుతం చేస్తున్న సినిమా ఇంకా పూర్తవలేదు. మీ సినిమా ఫస్ట్ కాపీ వచ్చినా సరే, నా ప్రస్తుత చిత్రం విడుదలైన తర్వాతే బండోడు-గుండమ్మ విడుదల చేయాలి. దాసరి గారితో మీరు ఎలా మాట్లాడతారో, ఒప్పిస్తారో మీ ఇష్టం. అలా అయితేనే రేపు పూజకు వస్తాను, లేకపోతే మరికొన్ని రోజులు ఆగుదాం” అని కరాఖండిగా చెప్పారు. ఈ మాటలతో నిర్మాత రాజు గుండెల్లో రాయి పడింది. నిస్సహాయంగా దాసరి నారాయణరావు వద్దకు వెళ్లిన జీవీఎన్ రాజు, కృష్ణంరాజు పెట్టిన షరతును దాసరికి వివరించారు.
ఈ విషయం వినగానే దాసరికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొదటి నుంచీ హీరోల పెత్తనాన్ని, షరతులను ఆయన అంగీకరించేవారు కాదు. “ఒక సినిమా చేస్తున్నప్పుడు, ఇంకో సినిమా ఒప్పుకోకూడదు కదా? మన చిత్రం ముందు పూర్తయినా, వాళ్ల కోసం ఎందుకు ఆగాలి? సినిమా విడుదల ఆలస్యమైతే ఫైనాన్షియర్లకు అధిక వడ్డీలు కట్టాలి కదా? ఆ ఖర్చు నిర్మాత ఎందుకు భరించాలి? ఇది కుదరదు. మన సినిమా ముందు రెడీ అయితే ఆగే ప్రసక్తే లేదు” అని దాసరి స్పష్టం చేశారు. దాసరి మాటలను కృష్ణంరాజుకు చెప్పడానికి వెళ్లిన నిర్మాతకు మళ్లీ నిరాశే ఎదురైంది. కృష్ణంరాజు తన నిర్ణయాన్ని మార్చుకోకుండా, మరింత కఠినంగా “నేను చెప్పిన దానికి మీరు ఓకే అంటేనే రేపు పూజకు వస్తా. లేకపోతే మీరు మళ్లీ రావాల్సిన అవసరం లేదు” అని చెప్పారు. ఇటు హీరో, అటు దర్శకుడు, ఎవరినీ కాదనలేని పరిస్థితిలో జీవీఎన్ రాజు మళ్లీ దాసరి వద్దకు వెళ్లారు. కృష్ణంరాజు వైఖరి గురించి విన్న దాసరి, “హీరో ఏం చెబితే అది మనం చేసేయాలా? మొదట్లోనే ఇన్ని షరతులు పెడుతుంటే ముందు ముందు ఇంకా ఎన్ని చెబుతారో? మీకు హీరో కావాలో, నేను కావాలో తేల్చుకోండి. నేనే కావాలనుకుంటే నా నిర్ణయం వేరేగా ఉంటుంది” అని అన్నారు. మౌనంగా తలదించుకుని కూర్చున్న నిర్మాతను చూసి, రెండు నిమిషాల ఆలోచన తర్వాత దాసరి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. “కృష్ణంరాజును తీసేసి వేరే హీరోని పెట్టుకుందాం. ఇది నా నిర్ణయం. ఫైనల్ డెసిషన్ మీదే” అన్నారు. కృష్ణంరాజుకు సన్నిహితుడైన జీవీఎన్ రాజు మొదట ఇబ్బంది పడినా, తన పరువు పోకుండా రేపు ముహూర్తం జరగాలని దాసరిని వేడుకున్నారు. ఆ సమయంలోనే దాసరి కృష్ణంరాజుతో కలిసి సీతారాములు చిత్రాన్ని తీస్తున్నారు. అయినా సరే, కృష్ణంరాజుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి ఆయన వెనుకాడలేదు. బండోడు-గుండమ్మకు సరైన హీరో ఎవరని ఆలోచించగా, సూపర్ స్టార్ కృష్ణ ఆయన కళ్ళ ముందు మెరిశారు. రాత్రి 11 గంటలకు దాసరి వెంటనే కృష్ణకు ఫోన్ చేశారు. “మీరు నా కోసం జీవీఎస్ రాజు గారికి ఒక సినిమా చేయాలి” అని డైరెక్ట్‌గా విషయం చెప్పేశారు. కృష్ణ, “అదేమిటి, కృష్ణంరాజు చేస్తున్నారు కదా ఆ సినిమా?” అని అడగగా, “అది గంట క్రితం వరకు. ఇప్పుడు మీరే హీరో. నా మీద గౌరవం, నమ్మకం ఉంటే ఒప్పుకోండి. పొద్దున్నే ముహూర్తం, రండి” అని దాసరి అన్నారు. జరిగిన విషయం అంతా విన్న కృష్ణ, “ఈ సినిమా నేను చేస్తున్నాను” అని అభయం ఇచ్చారు. దాసరి ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారని ఊహించని కృష్ణంరాజు, విషయం వినగానే షాక్ అయ్యారు. ఈ సంఘటన తర్వాత దాసరి, కృష్ణంరాజు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. యధావిధిగా 1980 ఏప్రిల్ 10న సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం, ప్రభ మరో కథానాయికగా బండోడు-గుండమ్మ షూటింగ్ ప్రారంభమైంది. 1980 అక్టోబర్ 3న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించి, తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.