Headlines

Union Cabinet:10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. 1 కోటి జరిమానా.. ‘పేపర్ లీక్’ చట్టానికి మరింత పదును! | 10 Year Jail, Rs 1 Crore Fine: In Big Blow to Exam Paper Leak Mafias, Central Government Prepares Harsher Laws

Union Cabinet:10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. 1 కోటి జరిమానా.. ‘పేపర్ లీక్’ చట్టానికి మరింత పదును! | 10 Year Jail, Rs 1 Crore Fine: In Big Blow to Exam Paper Leak Mafias, Central Government Prepares Harsher Laws


దేశవ్యాప్తంగా కలకలం రేపిన ప్రశ్నపత్రాల లీకేజీ వివాదం తీవ్రరూపం దాల్చిన వేళ, కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు, నీట్ (NEET) లీకేజీ వ్యవహారంలో గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేసిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఇచ్చిన స్పష్టమైన హామీతో వాంగ్‌చుక్ తన దీక్షను విరమించారు. ప్రధాని మోదీ సైతం ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ అంశంపై గత 24 గంటల్లో ప్రధాని రెండు కీలక సందేశాలను విడుదల చేశారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్, 2024కు కఠిన సవరణలు చేస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లుపై శుక్రవారం (జూలై 24) మధ్యాహ్నం జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండవ వారం ప్రారంభంలోనే ఈ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి, వీలైనంత త్వరగా ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పేపర్ లీకేజీ కేసుల విచారణ వేగవంతం చేసేందుకు ప్రత్యేక ‘ఫాస్ట్ ట్రాక్ కోర్టులను’ ఏర్పాటు చేయాలని, దోషులకు తక్షణమే శిక్షలు పడేలా ఆదేశాలు ఇచ్చామని ప్రధాని తెలిపారు.

ప్రస్తుత చట్టం ప్రకారం వ్యక్తిగత నేరాలకు 3 నుండి 5 ఏళ్ల జైలు, రూ. 10 లక్షల జరిమానా ఉండగా.. వ్యవస్థీకృత ముఠాలకు 5 నుండి 10 ఏళ్ల జైలు, రూ. 1 కోటి వరకు జరిమానా ఉంది. ప్రతిపాదిత కొత్త సవరణల ప్రకారం, ఈ శిక్షల కాలాన్ని, జరిమానా మొత్తాన్ని మరింత పెంచనున్నారు. పరీక్షల మాఫియా, కోచింగ్ సెంటర్లు లేదా అధికారుల కుమ్మక్కైనా సరే, ఎవరినీ విడిచిపెట్టకుండా చట్టపరమైన అస్త్రాలను మరింత పదును చేస్తోంది కేంద్రం. కేవలం శిక్షలు పెంచడమే కాకుండా, పేపర్ లీక్ కేసులను వేగంగా విచారించి బాధ్యులకు తక్షణమే శిక్ష పడేలా ప్రణాళికలు సిద్ధం చేసింది కేంద్రం.

ఈ లీకేజీలు లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కలిగిస్తాయని ప్రధాని మోదీ అంగీకరించారు. నీట్ వివాదం వెలుగులోకి వచ్చినప్పటి నుంచే నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపామని తెలిపారు. విద్యార్థుల ఒక విద్యా సంవత్సరం వృథా కాకుండా, అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించి 22 లక్షల మంది విద్యార్థులకు తిరిగి పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని ఆయన పునరుద్ఘాటించారు. “యువత సంక్షేమం, వారి భవిష్యత్తు మాత్రమే మా మొదటి ప్రాధాన్యత” అని ప్రధాని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *