Headlines

Watch: కేవలం 16 గంటల్లో బీభత్సం సృష్టించిన వాన.. బొమ్మల్లా కొట్టుకుపోయిన కార్లు! ఎక్కడంటే.. | Heavy Rains Wreak Havoc in Gujarat: Valsad Records 1100 mm Rainfall in 16 Hours, Cars Submerged in Valsad

Watch: కేవలం 16 గంటల్లో బీభత్సం సృష్టించిన వాన.. బొమ్మల్లా కొట్టుకుపోయిన కార్లు! ఎక్కడంటే.. | Heavy Rains Wreak Havoc in Gujarat: Valsad Records 1100 mm Rainfall in 16 Hours, Cars Submerged in Valsad


వల్సాద్, జులై 24: గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా అత్యంత ప్రభావిత ప్రాంతంగా మారింది. జిల్లాలోని ఉంబర్‌గాం ప్రాంతంలో గురువారం ఉదయం వరకు కేవలం 16 గంటల్లోనే 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. వల్సాద్ జిల్లాలోని వాపి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా పార్కింగ్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. బహుళ అంతస్తుల భవనం పార్కింగ్‌లో నిలిపిన కార్లు దాదాపు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించీన వీడియోలు ప్రస్తుతం నెట్టింత వైరల్‌గా మారాయి.

ఈ వీడియోలో పార్కింగ్ ప్రాంతంలో నీటి మట్టం కార్ల కిటికీల వరకు చేరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. భవనం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం (SEOC) వివరాల ప్రకారం, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వల్సాద్ జిల్లా అత్యధికంగా ప్రభావితమైంది. ఉంబర్‌గాం మాత్రమే కాకుండా జిల్లాలోని పలు తాలూకాల్లో కూడా 600 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఔరంగా, పార్, దమన్ గంగా నదులు ప్రమాదకర స్థాయికి చేరుకుని పొంగిపొర్లుతున్నాయి. దీంతో వల్సాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరద పరిస్థితుల నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వల్సాద్‌తో పాటు సూరత్ నగరంలోని లోతట్టు ప్రాంతాల నుంచి 2,200 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైన చోట సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందిస్తున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్, నవ్‌సారీ, డాంగ్స్, సూరత్, తాపీ జిల్లాలకు గురువారం, శుక్రవారం రోజుల కోసం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన ఐఎండీ, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.

సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక, పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు పలువురు మంత్రులను వరద ప్రభావిత జిల్లాలకు పంపించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *