అమాయకపు ఆదివాసీ జనం.. కల్మషం లేని ప్రేమ వారి సొంతం. ఆత్మీయతలకు ఆప్యాయతలకు వారు పెట్టింది పేరు. పూరి గుడిసెల్లో.. గుడ్డిదీపాల కింద కాలం వెళ్లదీసే అడవమ్మ బిడ్డలు వారు. అడవినే నమ్ముకుని అడవితోనే బతుకంటూ సాగిపోయే జనం వాళ్లు. కష్టాలు ఎన్నొచ్చినా కన్నీళ్లతోనే ప్రయాణం చేసే బడుగు జీవులు. అలాంటి గూడెం జనాలకు ఓ కాసింత సాయం చేస్తే చాలు ఎల్లకాలం గుర్తుంచుకుంటారు. అలాంటిది వారి గుండెల్లో వెలుగులు నింపితే.. పక్క గూడును అందిస్తే ఇంకెంత అభిమానాన్ని చాటుకుంటారు..? ఇదిగోఇలా తమ గూడానికే పేరు పెట్టుకునేంతలా ప్రేమను చాటుతారు. ఆదిలాబాద్ అడవి బిడ్డలకు మాత్రమే సొంతమైన ఆత్మీయ అనుబంధానికి సాక్ష్యమే ఈ కథనం.
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా. ఏసీ రూం పాలనకు స్వస్తి చెప్పి గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని అసలుసిసలైన ప్రభుత్వ పాలనను అందిస్తున్న జిల్లా బాస్. ఆదివాసీ పలెల్లను, గూడాలను కలియ తిరిగుతూ నేరుగా సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కారం చూపిస్తున్న కలెక్టర్ ఆయన. ఆదివాసీల కష్టసుఖాల్లో పాలు పంచుకుని వారి ఇబ్బందులు దూరం చేసేందుకు శాయశక్తుల విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ గా మాత్రమే కాకుండా.. వారిలో ఒక మనిషిగా కలిసిపోయారు. ఆదివాసీల కష్టాలను తెలుసుకునేందు అడవిబాటపట్టారు. తన డ్యూటీ అంటే తన జిల్లా ప్రజల కష్టాలు తెలుసుకోవటమేననుకున్నారు. అలా సేవలందిస్తున్న కలెక్టర్ రాజార్షి షా కి అంతే ప్రేమను బహుమానంగా ఇచ్చారు ఓ ఆదివాసీ గూడం ప్రజలు.
జిల్లాలోని ఓ మారుమూల గూడెంలో సరైన నివాసం లేక ఇబ్బందులు పడుతున్న కొలాం గిరిజనుల జీవితాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా సరికొత్త వెలుగులు నింపారు. నిరుపేదలకు ఇళ్ల పట్టాలతో పాటు 'ఇందిరమ్మ గృహాలు' మంజూరు చేసి, వారి సొంతింటి కలను నిజం చేయడంలో ప్రత్యేక చొరవ చూపారు. ఆయన సేవలకు గుర్తుగా గిరిజనులు అంతే ప్రేమతో నీరాజనాలు పట్టారు. తమ బతుకుల్లో మార్పు తెచ్చిన అధికారిపై ప్రత్యేక అభిమానంతో, దహిగూడ కొలాం గూడేనికి ఏకంగా ఆయన పేరునే పెట్టుకున్నారు. కలెక్టర్ రాజార్షి షా సేవలకు గుర్తుగా తమ గూడెం ఇక నుండి 'రాజర్షిషా గూడ' గా పిలవబడుతుందని.. కలెక్టర్ పేరుతో తమ గూడాకి నామకరణం చేసుకుని తమ కృతజ్ఞతను చాటుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలంలో గురువారం పిప్పలధరి పంచాయతీ పరిధిలోని దహిగూడ లో పర్యటించిన జిల్లా కలెక్టర్, గ్రామంలో నిర్మాణం పూర్తయిన మూడు ఇందిరమ్మ గృహాలకు సంబంధించి గృహ ప్రవేశ వేడుకలను స్వయంగా ప్రారంభించారు. గతంలో 17 మంది పేద గిరిజనులకు ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఆయన చొరవతో మౌలిక వసతులు వేగవంతమయ్యాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో కలెక్టర్ గిరిజనులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామని హామీ ఇస్తూ.. పిప్పలధరి పంచాయతీ పరిధిలో మరో 10 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గిరిజన కుటుంబాల ఆర్థిక ఎదుగుదలకు మేకలు, పాడి పశువుల (బర్రెల) యూనిట్ల మంజూరుతో పాటు మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ, డిగ్రీ చదివిన స్థానిక యువతకు ఆదిలాబాద్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
గ్రామంలో ప్రధాన సమస్యలైన కరెంట్, సెల్ నెట్వర్క్, రవాణా సౌకర్యాలపై కలెక్టర్ వెంటనే స్పందించారు. తరచూ విద్యుత్ నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఈఈని ఆదేశించగా, సెల్ టవర్ నిర్మాణం కోసం స్థలం కేటాయించి నెట్వర్క్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఆధార్ కార్డులు లేని వారికి వెంటనే కొత్త ఆధార్ల నమోదు పూర్తి చేయాలని ఇడిఎం, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అలాగే మారుమూల మామిడికోరి గ్రామానికి రోడ్డు (CD వర్క్) సౌకర్యం, జలసిరి కింద రైతులకు ఫార్మ్ పాండ్స్, అర్హులకు చేయూత పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దివ్యా దేవరాజన్ గుర్తుగా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలి సమీపంలోని గూడానికి ‘దివ్యగూడ’ అని పేరు పెట్టుకున్నారు. అప్పుడు దివ్య దేవరాజన్ కు ఇప్పుడు రాజార్షి షా కు.. ఓ కలెక్టర్ కు ఇంతకు మించిన గౌరవం ఇంకేం ఉంటుంది. శభాష్ కలెక్టర్లు అంటే మీలానే ఉండాలి.. ప్రజలతో ప్రజల కోసం ప్రజల మధ్య ప్రజా పాలన అందించేందుకు.




